Drugs Case: మాసాబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసు: ప్రముఖ నటి సోదరుడు అమన్‌ప్రీత్ పరారీ

ప్రముఖ నటి సోదరుడు అమన్‌ప్రీత్ పరారీ

Update: 2025-12-27 11:02 GMT

Drugs Case: మాసాబ్‌ట్యాంక్ ప్రాంతంలో బయటపడిన డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రముఖ సినీ నటి సోదరుడైన అమన్‌ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతని కోసం ఈగల్ స్పెషల్ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు.

ఈ నెల 17వ తేదీన ట్రూప్ బజార్‌కు చెందిన వ్యాపారులు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీలను అరెస్టు చేశారు. వీరిని విచారించిన సమయంలో అమన్‌ప్రీత్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు వ్యాపారుల నుంచి అతడు మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్టు ఈగల్ టీమ్ గుర్తించింది. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి సుమారు 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గమనార్హమైన విషయం ఏమిటంటే, గత సంవత్సరం కూడా అమన్‌ప్రీత్ సైబరాబాద్ పోలీసులకు చిక్కి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నేపథ్యం ఉంది. మరోవైపు, అరెస్టైన ఇద్దరు వ్యాపారులకు మరో నలుగురు వ్యక్తులు క్రమం తప్పకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసు దర్యాప్తులో తేలింది.

ఈ కేసు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమన్‌ప్రీత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. దర్యాప్తు కొనసాగుతోంది.

Tags:    

Similar News