Bandi Sanjay: బండి సంజయ్: భారాస మునిగిపోతున్న నావ.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే
ఈ ప్రభుత్వానికి ఎలాంటి హామీ లేదు
ఒవైసీ సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజించారు
Bandi Sanjay: రాష్ట్రంలో భారాస పార్టీ మునిగిపోతున్న నావలా మారిందని, కాంగ్రెస్‌ను ఎదుర్కోగల సామర్థ్యం, స్థైర్యం ఉన్న ఏకైక పార్టీ భాజపా మాత్రమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు కాంగ్రెస్, భారాస, ఎంఐఎం మూడు పార్టీలు కుట్రలు పన్నాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మేయర్ పదవి భాజపాకు రాకుండా ప్రయత్నించినప్పటికీ, చివరికి కమలం పార్టీనే విజయం సాధించిందని ఆయన చెప్పారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్, పార్టీ కార్పొరేటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో విజయం సాధించిన కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకుముందు పాత నగరంలోని భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళీ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారాస పార్టీ ఇక పూర్తిగా అంతరించిపోతుందని, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేకపోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేని స్థితికి దిగజారిందని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా భాజపా మాత్రమే ఉందని, మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయని, అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి హామీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సువర్ణ ఆలయంగా మారుస్తాం
మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ఓటింగ్ శాతం పెరిగిందని, కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు నారాయణపేట, భైంసా మున్సిపాలిటీలలో విజయాలు సాధించామని బండి సంజయ్ తెలిపారు. ఈ ఉత్సాహంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుపొందాలని పిలుపునిచ్చారు. కొందరు పార్టీ గుర్తుతో గెలిచి తమ వ్యక్తిగత విజయంగా భావిస్తారని, కానీ పార్టీ బలంతో గెలిచి తాము గొప్పవారమని అనుకున్న అనేక మంది చరిత్రలో మరుగున పడిపోయారని ఆయన హెచ్చరించారు. అందరికంటే పార్టీనే గొప్పదని ఆయన గుర్తుచేశారు. ఒవైసీ సౌకర్యార్థమే హైదరాబాద్ మహానగరపాలక సంస్థను మూడు భాగాలుగా విభజించారని, ఇందులో ఒక కార్పొరేషన్‌ను మజ్లిస్ పార్టీకి అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన ఆరోపించారు. 2028లో తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యమని, అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సువర్ణ ఆలయం తరహాలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని, కాంగ్రెస్, భారాస నేతలు నిజమైన హిందువులైతే పార్టీలను వదిలి ధర్మరక్షణ కోసం భాజపాలో చేరి కాషాయ జెండా పట్టుకోవాలని ఆయన సవాల్ విసిరారు. మజ్లిస్ ఆగడాలకు భయపడి పాతబస్తీని వదిలి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలని, భాజపా మీకు అండగా ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునిల్‌రావు, నాయకులు గౌతంరావు, అశోక్, వీరేంద్ర గౌడ్, మనోహర్‌రెడ్డి, పొన్న వెంకటరమణ, ఉమా మహేంద్ర, ఆలె జితేంద్ర, పాశం సురేందర్, ఆలె భాగ్యలక్ష్మి, సుభాష్ చందర్ జీ, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.