Massive Frauds in the Name of Stock Market Investments: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసాలు

పెట్టుబడుల పేరుతో భారీ మోసాలు

Update: 2025-10-17 06:28 GMT

Massive Frauds in the Name of Stock Market Investments: సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన అపరిచితుల మాటలు నమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం సరైందా? రూ.లక్షకు రూ.10 లక్షల లాభం వస్తుందని ఆశ చూపిస్తే వెంటనే నమ్మేస్తామా? అయినప్పటికీ, కొందరు కనీస పరిశీలన లేకుండా రూ.కోట్లు బదిలీ చేసి మోసపోతున్నారు. తెలంగాణలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయి. 2024లో 5,359 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం ఆగస్టు అంతం వరకు 4,304 కేసులు రిజిస్టర్ అయ్యాయి. మొత్తంగా 20 నెలల్లో సుమారు రూ.వెయ్యి కోట్లు నష్టం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఇలాంటి మోసాలు అధికంగా నమోదవడం ఆందోళనకరం.

ఆన్‌లైన్ పరిచయాలతో మోసాలు..

సైబర్ మోసగాళ్లు ముఖ్యంగా సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా ఈ మోసాలు చేస్తున్నారు. ట్రేడింగ్ సలహాలు ఇస్తామంటూ వాట్సప్ గ్రూపుల్లో చేర్చుతున్నారు. ఆ గ్రూపుల్లో ఇప్పటికే ఉన్న సభ్యులు రెట్టింపు లాభాలు సంపాదించామంటూ నకిలీ స్క్రీన్‌షాట్లు పంచుకుంటున్నారు. దీన్ని నమ్మి కొందరు మొదట రూ.వేలల్లో పెట్టుబడి పెట్టగా, రెండు-మూడు రెట్లు లాభాలు ఇచ్చి విశ్వాసం కలిగిస్తున్నారు. తర్వాత రూ.కోట్లలో పెట్టుబడి పెట్టించి మోసం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి రూ.45 వేల పెట్టుబడికి రూ.8,600 లాభం వచ్చినట్లు నమ్మి, 65 రోజుల్లో రూ.7.11 కోట్లు బదిలీ చేసి నష్టపోయాడు.

వలపు జాలంలో చిక్కుకుని..

హనీట్రాప్ పద్ధతితో డబ్బు లాగేస్తున్నారు. యువతుల పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి సందేశాలు పంపుతున్నారు. ఎవరైనా స్పందిస్తే మధురమైన మాటలతో ఆకర్షిస్తున్నారు. తాను ట్రేడింగ్ చేస్తున్నట్లు నమ్మబలుకుతున్నారు. త్వరగా సంపాదనకు మార్గమంటూ నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల లింకులు పంపుతున్నారు. ఇది నిజమేనని భావించి చాలా మంది మోసపోతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి

స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు నిర్దేశిత ఖాతాలు ఉంటాయి. వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపమని అడిగితే అది మోసమేనని గుర్తుంచుకోండి.

సోషల్ మీడియా రీల్స్, ప్రకటనలు లేదా వాట్సప్ లింకులను చూసి పెట్టుబడులు పెట్టవద్దు.

అనుమతి లేకుండా వాట్సప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చితే తక్షణం బయటకు వచ్చేయండి.

మోసపోయి డబ్బు కోల్పోతే ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి.

Tags:    

Similar News