Minister Ponguleti: భూసమగ్ర సర్వేలో పారదర్శకతకు ప్రాధాన్యం.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Minister Ponguleti: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వేపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. భూ రీసర్వేలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సర్వేకు ముందు భూయజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, గ్రామకంఠాల హద్దుల విషయంలో స్పష్టమైన మార్గనిర్దేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సమగ్ర సర్వేను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సర్వే మూడు దశల్లో కొనసాగుతుందని, వచ్చే నెలాఖరులోగా తొలి దశను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే తొలి దశలో 2,720 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తయిందని ఆయన వెల్లడించారు.
ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్కు ప్రత్యేక భూదార్ ఐడీని కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు. ఆధునిక సాంకేతికతతో భూముల కొలతలు తీసుకుని వాటిని డిజిటల్ రూపంలో భద్రపరుస్తూ, భూ భారతి పోర్టల్లో నమోదు చేస్తున్నామని చెప్పారు. భూయజమానులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ చేస్తామని, నేలకొండపల్లి మండలం కొంగరలో 665 ఎకరాల్లో వందశాతం రీసర్వే పూర్తయిందని మంత్రి తెలిపారు.