తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్‌.రామచంద్రరావు ఏకగ్రీవ ఎన్నిక

రామచంద్రరావు పేరు ప్రకటించిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే;

Update: 2025-07-01 07:33 GMT

భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఎన్‌.రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే ప్రకటించారు. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో రామచంద్రరావు ఒక్కరే నామినేషన్‌ వేయడంతో మంగళవారం శోభ కరంద్లాజే రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పార్టీ సీనియర్‌ కార్యకర్తను అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా కరంద్లాజే వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్‌ పార్టీ భారతీయ జనతా పార్టీ అని రానున్న మూడేళ్ళలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసమే ఆలోచిస్తారని, దేశం కోసం రోజులో 18 గంటలు పని చేసే నాయకుడు మన ప్రధాని అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. 11 ఏళ్ళ పాలన తరువాత కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వం మోడీదన్నారు. ప్రధాని మోడీ విదేశాలు వెళితే ఆయా దేశాలు ఆయనకు అత్యంత గౌరవం ఇస్తున్నాయని చెప్పారు. దేశ ప్రతిష్టను ప్రపంచంలో అంతగా మోడీ పెంచారన్నారు. రామచంద్రరావు నాయకత్వంలో రాబోయే మూడు సంవత్సరాల్లో బీజేపీని ప్రతి ఇంటికి చేర్చాలని కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీకి సూచించారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు హైకమాండ్‌ కి కప్పం కట్టడానికి మాత్రమే పని చేస్తున్నాయని, అటువంటి ప్రభుత్వాలపై గట్టిగా పోరాడి, 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్కారుని ఏర్పాటు చేసుకోవలని కేంద్ర మంత్రి శోభాకరంద్లాజే బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News