CM Revanth Reddy: ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలి.. నిర్లక్ష్యం చూపితే కలెక్టర్లపై కూడా చర్యలు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి

నిర్లక్ష్యం చూపితే కలెక్టర్లపై కూడా చర్యలు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి

Update: 2026-05-13 12:57 GMT

CM Revanth Reddy: రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం ఉంటే కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పురోగతిని సమీక్షించారు. వివిధ జిల్లాల్లో తలెత్తిన సమస్యలపై కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల వద్ద అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.

కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు

ఒప్పందం ప్రకారం లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సీఎం హెచ్చరించారు. ధాన్యం తరలింపుకు అవసరమైన వాహనాలు సమకూర్చేలా రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. గోడౌన్ల సమస్య ఉన్నచోట తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని, రైతుబజార్లు, ఫంక్షన్‌ హాళ్లను వినియోగించాలని చెప్పారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలని నిర్దేశించారు.

అకాల వర్షాల నుంచి రైతులను కాపాడాలి

అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. మొక్కజొన్న పంట ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసు సహాయం తీసుకోవాలని అన్నారు. ధాన్యం లోడ్‌ చేసిన వెంటనే రైతులకు రసీదు ఇవ్వాలని, తాలు-తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని సూచించారు. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మంత్రుల వ్యాఖ్యలు

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, సమస్యలు ఎదురైతే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తరలింపు వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నెలాఖరులోగా సేకరణ పూర్తి చేయాలని నిర్దేశించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ మంత్రులు, సీఎస్‌ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News