Minister Ponguleti Srinivasa Reddy: కాస్తుదారులకే పట్టా పాసుపుస్తకాలు: ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూసర్వే, కాకరవాయిలో సర్వే పూర్తి: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Update: 2026-06-10 10:25 GMT

Minister Ponguleti Srinivasa Reddy: తరతరాలుగా సాగుకు వాడుతున్న భూములపై పట్టా పాసుపుస్తకాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి, కాస్తులో ఉన్నవారికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.

తొలి విడతలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో భూసర్వే విజయవంతంగా పూర్తయిందని, మిగిలిన 69 గ్రామాల్లో కూడా త్వరలో సర్వే పూర్తి చేసి పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన కొంత భూమిని గత ప్రభుత్వం ‘ధరణి’లో నిషేధిత జాబితాలో చేర్చిందని, ఆ భూములను పట్టా భూముల నుంచి తొలగించే ప్రక్రియను తమ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిందని తెలిపారు.

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహించి రైతుల అర్జీలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఖమ్మంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ...

సాదాబైనామా దరఖాస్తులు: గత ప్రభుత్వం ధరణి చట్టం తీసుకొచ్చే ముందు ఆన్‌లైన్‌లో సాదాబైనామాలపై 9.26 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించకుండా వదిలేసిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నిబంధనలు సవరించిందని చెప్పారు. ఇప్పటివరకు 5.30 లక్షల మందికి నోటీసులు ఇచ్చామని, మిగిలిన వారికి 15 రోజుల్లో నోటీసులు ఇచ్చి, 30 రోజుల గడువు తర్వాత అర్హులైన సాదాబైనామాలను పరిష్కరిస్తామని తెలిపారు.

ప్రజల్లో అపార విశ్వాసం: ప్రజాదర్బార్లో పాలేరు నియోజకవర్గం నుంచి 24,900 పైచిలుకు అర్జీలు వచ్చాయని మంత్రి వెల్లడించారు. కార్యక్రమానికి హాజరైన సుమారు 40 వేల మంది పేదలు, ఆపన్నులు ప్రభుత్వంపై అపార విశ్వాసం చూపారని అన్నారు. భాజపా, భారాస నాయకుల రాజకీయ ఆరోపణల్లో నిజం లేదని ప్రజలు గుర్తించాలని కోరారు.

ఈ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించి, వారికి భూస్వామ్య హక్కులు కల్పించడం లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Tags:    

Similar News