Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు సాక్ష్యాలు ధ్వంసం చేశారని సుప్రీంకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

సుప్రీంకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2025-09-23 08:34 GMT

Phone Tapping Case: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. సిట్టింగ్ జడ్జీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు కీలక సాక్ష్యాలను ధ్వంసం చేశారని, విచారణకు సహకరించడం లేదని పేర్కొంది. అందుకే, గతంలో ఆయనకు మంజూరైన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.

2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోవడంతో, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత, మే 9న సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. మే 29న సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే, ఆయన తన ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ఫార్మాట్ చేసి సాక్ష్యాలను ధ్వంసం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించారు. జులై 15న సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమైందని తెలిపారు.

ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, ప్రభుత్వ ఆరోపణలను ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ కేసు దురుద్దేశంతో దాఖలు చేశారని ఆరోపించారు. సాక్ష్యాలు ధ్వంసం చేయలేదని, కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల బెంచ్, విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర రక్షణ ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Tags:    

Similar News