T. Harish Rao: కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: హరీశ్‌రావు హెచ్చరిక

ప్రభుత్వాన్ని నిలదీస్తాం: హరీశ్‌రావు హెచ్చరిక

Update: 2026-03-12 12:11 GMT

T. Harish Rao: రాష్ట్ర ప్రజలకు అవిరామ సేవలందిస్తున్న టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తామని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నేత టి. హరీశ్‌రావు ప్రకటించారు. ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆయన్ను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, కార్మికుల పక్షాన అసెంబ్లీ వేదికగా వారి సమస్యలను బలంగా లేవనెత్తి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు, కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు కార్మికులు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కాపాడుకోవాలని పోరాడుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివిధ విభాగాలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి, వారికే సబ్సిడీలు ఇస్తూ ఆర్టీసీని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. జీరో టికెట్ పథకం అమలుకు ప్రతి నెల రూ.350 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఇప్పుడు అరకొర నిధులు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. గత రెండేళ్లుగా ఈ పథకానికి సంబంధించిన బకాయిల భారం ఆర్టీసీపైనే మోపడంతో సంస్థ ఆర్థికంగా కుదేలవుతోందన్నారు.

ఉద్యోగులకు రెండు పీఆర్సీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, 2025 పీఆర్సీ కూడా అమలు కాకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ‘అపాయింటెడ్ డే’ ప్రకటించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మికులకు దక్కాల్సిన పదోన్నతులు, ఉద్యోగ భద్రత, రిటైర్‌మెంట్ ప్రయోజనాలు వంటి హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అండగా ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ చూపకుండా, తక్షణమే రూ.2,804 కోట్ల బకాయిలను విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన కార్మికుల సమస్యలను బలంగా వినిపిస్తామని, ప్రభుత్వం మెడ వంచినా పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా పోరాడతామని ఆయన ఉద్ఘాటించారు.

Tags:    

Similar News