Ponguleti Srinivas Reddy: జిల్లాకు ఒక మండలంలో ‘సమీకృత భూభారతి’ అమలు

అమలు

Update: 2026-06-23 14:27 GMT

రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ తప్పనిసరి

సాదాబైనామాల క్రమబద్ధీకరణపై వేగం పెంచాలి: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy: సాగుభూముల యాజమాన్య హక్కులను రక్షించడం, రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ ప్రక్రియలను పూర్తిగా పారదర్శకంగా మార్చడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌ను త్వరలోనే ప్రతి జిల్లాకు ఒక మండలంలో అమలు చేయనుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి సోమవారం రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించి, వివిధ అంశాలపై సమీక్షించారు. సాగు భూముల క్రయవిక్రయాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్‌ వేళ సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా జత చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలవుతోంది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను అధికారులు వివరించగా, ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. దీంతో రెండో దశలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక్క మండలంలో ఈ సమీకృత భూభారతి విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.

భూభారతి చట్టం అమలులోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాసుపుస్తకాలు జారీ చేశామని మంత్రి వెల్లడించారు. గతంలో రైతులు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దరఖాస్తు చేసిన వెంటనే పాసుపుస్తకం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు.

సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణపైనా మంత్రి ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 6 లక్షల దరఖాస్తుదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని వివరించారు. మిగిలిన దరఖాస్తుదారులందరికీ వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ చేయాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హత ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి సూచించారు.

ఈ చర్యల ద్వారా భూసంబంధిత సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని, రైతులు సునాయాసంగా భూహక్కులను పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News