Priyanka's Condition: ప్రియాంక ఆరోగ్యం అత్యంత విషమం.. అప్నియా పరీక్ష విఫలం.. మృత్యువుతో పోరాటం
మృత్యువుతో పోరాటం
Priyanka's Condition: రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. గడిచిన ఆరు రోజులుగా ప్రియాంక మృత్యువుతో పోరాడుతోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో కర్నూలుకు చెందిన ప్రియాంక డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్యమాల్‌లో సినిమా చూసి, సహచర విద్యార్థి దుర్గవెంకటసాయితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రద్దీ కారణంగా వాహనాలు థియేటర్ గేటు వద్ద ఆగగా.. అదే సమయంలో నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌లు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టారు. తరువాత మరోసారి బలంగా ఢీకొట్టి.. పైనుంచి కారు వెళ్లడంతో కిందపడిపోయిన ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేయడానికి వైద్యులు ప్రయత్నించగా.. ఆమె శరీరం సహకరించకపోవడంతో విరమించుకున్నారు. కోమాలో ఉన్న ప్రియాంక మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిందా.. లేదా అని నిర్ధారించడానికి డాక్టర్లు కీలకమైన పరీక్ష చేయనున్నారు. ఆప్నియా పరీక్ష అనంతరం చివరి రిజల్ట్‌ను విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయనున్నారు. అంతేకాకుండా, ప్రియాంక ఆర్గాన్ డొనేషన్ చేసే విషయంపై తల్లిదండ్రులకు ఇప్పటికే పలు మార్లు కిమ్స్ వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మెడికో చనిపోయిందని నిర్ధారిస్తే ఆర్గాన్స్ డొనేట్ చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలనే ఆలోచనలో ప్రియాంక కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆమె తల్లిదండ్రులతో వైద్యులు చర్చించారు.