Kishan Reddy’s Challenge: ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కిషన్‌రెడ్డి సవాల్
కిషన్‌రెడ్డి సవాల్
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి సవాల్.. తాను ప్రజలకు జవాబుదారీ అని వెల్లడి
Kishan Reddy’s Challenge: తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు తాను అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేసి నివేదిక తీసుకోవాలని సూచించారు. ఆ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన కిషన్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రామ్మోహన్‌నాయుడులతో చర్చించినప్పుడు ఆదిలాబాద్ కలెక్టర్‌ను పిలిపించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల అమలు కోసం అవసరమైనప్పుడు రాష్ట్ర అధికారులను పిలిపించుకుంటున్నామని వివరించారు.
“ప్రతి కేంద్ర మంత్రిని కలిసినప్పుడు తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నా. వాటికి నేను ఎక్కడా అడ్డుపడలేదు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ దయాదాక్షిణ్యాలతో మేము అధికారంలోకి రాలేదు. నేను సీఎంకి కాదు, కేంద్ర ప్రభుత్వానికి, నా నియోజకవర్గ ప్రజలకు, బీజేపీకి జవాబుదారీని” అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
చిల్లర రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని, మాటమీద నిలబడే వ్యక్తినని, అధికారం కోసం పార్టీ మారనని వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై చర్చకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమా? అని ప్రశ్నించారు. భారాస, కాంగ్రెస్ హయాంలో ఒకే తరహా పాలన, దోపిడీ జరుగుతోందని, సీఎం వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. హామీల అమలులో విఫలమైనందుకే బీజేపీ, తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవకుండా తాను అడ్డుపడలేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నాం
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కోసం మిగిలిన భూమి సేకరణ, డీపీఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలవాలని, అనంతరం ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మెట్రో రెండో దశ పనులు కొనసాగుతున్నాయని, ఎల్ అండ్ టీకి నిధులు అప్పుగా ఇప్పించామని వివరించారు. మూసీ నది అభివృద్ధి కోసం 36 ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు నిధులు మంజూరు చేశామన్నారు.
53 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అంగీకరించినట్లు పేర్కొన్న కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు ఏడాదికి రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తే, గతేడాది తాము రూ.26 వేల కోట్లు వ్యయం చేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తూనే ఉందని ఆయన వివరించారు.