Minister Ponguleti: రీ-సర్వేతోనే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి
Minister Ponguleti: రాష్ట్రంలోని అన్ని భూసమస్యలకు రీ-సర్వే మాత్రమే శాశ్వత పరిష్కారమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్‌లో భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, రీ-సర్వే అంశాలపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలతోపాటు నక్షాలు లేని మరో 413 గ్రామాల్లో రీ-సర్వే జరుగుతోందని మంత్రి వెల్లడించారు. భూభారతి చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆధార్ లాగా ఎల్‌పీఎం నంబర్లతో కూడిన భూధార్ కార్డును భూములు ఉన్న అందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. రీ-సర్వే ద్వారా సంవత్సరాల తర్వాత తమ భూములకు పరిష్కారం లభిస్తుందనే స్పందన రైతుల నుంచి వస్తోందని ఆయన అన్నారు.
సర్వే కోసం సుమారు 1,400 అధునాతన రోవర్‌లను ప్రతి జిల్లాకు అందజేశామని, 5,558 మంది సర్వేయర్లకు లైసెన్సులు ఇవ్వడమే కాకుండా మెరుగైన వేతనాలు చెల్లించి వారిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. సంవత్సరాలుగా సాగులో ఉండి సరైన టైటిల్ లేకుండా ఉన్న రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, వాటిలో 2 లక్షలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. రెండో విడతలో భాగంగా గతంలో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకునేలా ప్రతి నియోజకవర్గానికి 500 గృహాలు కేటాయిస్తున్నామని వివరించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజేశ్‌రెడ్డి, నారాయణరెడ్డి, వంశీకృష్ణారెడ్డి, అనిరుధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.