Revanth Reddy: కాళేశ్వరం వైఫల్యం: కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర విమర్శలు
తీవ్ర విమర్శలు
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల అవగాహనా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చేసిన తప్పులను మరోసారి ఎండగట్టారు.
“కేసీఆర్.. కాళేశ్వరంలో మీరు తప్పు చేశారు. కానీ మీ నేతలు మా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూ తప్పును మా మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇది మీ పార్టీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38 వేల కోట్లు కాగా, వాస్తవంగా రూ.1.47 లక్షల కోట్లు ఖర్చు చేశారని, అయినా నాణ్యత లేకుండా నిర్మాణం జరిగిందని విమర్శించారు. “మళ్లించే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు. తానే డిజైన్ చేశానని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఆయన మేధోశక్తి ఏమైంది? ప్రారంభించిన ఏడాదికే మరమ్మతులు వచ్చాయి” అని ప్రశ్నించారు.
ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్వయంగా ఎల్ అండ్ టీకి లేఖ రాసి మరమ్మతులు చేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించినా, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో మూడేళ్లలోనే మేడిగడ్డ కుంగిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది నిర్వాకం కాదు, విధ్వంసమని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని, మరమ్మతు బాధ్యతలు తీసుకోవాలని సవాల్ విసిరారు. “మీరు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష పడకూడదు. వారి పన్నులు వృథా కాకూడదు” అని పేర్కొన్నారు. సచివాలయం, ప్రజాభవన్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను తమ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా వినియోగిస్తోందని చెప్పారు.
కాళేశ్వరం పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నామని, సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.