Gandhi Sarovar Project: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ భూముల బదిలీ.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ రెడ్డి వినతి
రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ రెడ్డి వినతి
Gandhi Sarovar Project: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. మూసీ, ఈసా నదుల సంగమం సమీపంలో ‘గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ’ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.
చాకలి ఐలమ్మకు రేవంత్ నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అణచివేత, దమనకాండలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధిక్కార స్వరాన్ని వినిపించారని కొనియాడారు. 80 ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జంగ్ సైరన్ ఊదిన యోధురాలని గుర్తు చేశారు. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.