Robotic Surgeries: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలు విస్తరణ.. సామాన్యులకు అందుబాటులోకి
అందుబాటులోకి
Robotic Surgeries: అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.
హైదరాబాద్ ఎర్రగడ్డలోని డా.ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రిలో రాష్ట్ర స్థాయి మల్టీస్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90 శాతం ఉచితంగా అన్ని రకాల ఆధునిక, రోబోటిక్ సర్జరీలు అందిస్తామని చెప్పారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే ఆరు నెలల్లో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు.
నిమ్స్‌లో అతి తక్కువ సమయంలోనే వెయ్యి రోబోటిక్ సర్జరీలు నిర్వహించి ఘనత సాధించామని మంత్రి పేర్కొన్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్, టిమ్స్ ఆసుపత్రులతో పాటు నిర్మాణంలో ఉన్న ఉస్మానియా, గాంధీ నిలోఫర్, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జీజీహెచ్‌లలో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించనున్నామని వివరించారు.
టిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 40 వేలకు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టిమ్స్‌లో 100 పడకలను విదేశీ రోగుల కోసం కేటాయించామని చెప్పారు.
టిమ్స్ డైరెక్టర్ డా.నరేంద్రకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో యువ వైద్యులకు రోబోటిక్ సర్జరీపై అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో వైద్య విద్య డైరెక్టర్ డా.వాణి, రోబోటిక్ సర్జరీ నిపుణుడు డా.సుధీర్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.