Minister Sridhar Babu తెలంగాణలో రెండేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు.. రెండు లక్షల ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్‌బాబు
Minister Sridhar బాబు తెలంగాణలో గత రెండేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. దావోస్‌లో రూ.5.86 లక్షల కోట్ల పెట్టుబడులకు 108 ఒప్పందాలు కుదుర్చుకోగా అవన్నీ కార్యరూపం దాలుస్తున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్ర యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
జీసీసీలు, డేటా సెంటర్ల కోసం త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమలను విస్తరిస్తున్నామని తెలిపారు. శుక్రవారం శాసనసభలో ఐటీ పరిశ్రమలు, తెలంగాణ రైజింగ్ సమిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో కుదుర్చుకున్న ఎంవోయూలలో 23 శాతం, గత రెండేళ్లలో దావోస్ పర్యటనలో చేసుకున్న ఒప్పందాల్లో దాదాపు 45 శాతం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని మంత్రి వివరించారు. గత రెండేళ్లలో 75కు పైగా జీసీసీలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. గత ప్రభుత్వం ప్రధాన కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యం లేకుండా ఐటీ హబ్‌లు, టవర్లను నిర్మించడంతో అవి నిరుపయోగంగా మారాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని వినియోగంలోకి తెస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఆదిలాబాద్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించనున్నామని, నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
భారాస ఫ్యూచర్ లేని పార్టీ అని విమర్శిస్తూ, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేయాలనే దురుద్దేశంతో పారిశ్రామికవేత్తలను అడ్డుకుంటోందని ఆరోపించారు. గత భారాస ప్రభుత్వం ఫార్మా సిటీ పేరిట కాలుష్యాన్ని వెదజల్లే రెడ్ కేటగిరీ పరిశ్రమల ఏర్పాటుకు యత్నించిందని, ప్రస్తుత ప్రభుత్వం హరిత పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. తెలంగాణ ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి కేంద్రం సహకరించడం లేదని, భాజపా సభ్యులు దీనిపై చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్-బెంగళూరు రహదారిని రక్షణ కారిడార్‌గా కేంద్రం ప్రకటించాలని కూడా సూచించారు.
ఇంతలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూములను స్థిరాస్తి వ్యాపారాలకు వాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూముల విషయంలో సరైన నిబంధనలు ఉండాలని డిమాండ్ చేశారు. తన మిత్రుడు హైదరాబాద్‌లో పరిశ్రమ పెట్టేందుకు ప్రయత్నాలు చేయగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో వెనక్కి తగ్గారని చెప్పారు. ప్రోత్సహించకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం తోపాటు కాంగ్రెస్, భాజపా సభ్యులు తమ ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించాలని కోరారు.