CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ (నిరోధక) అట్రాసిటీస్ చట్టం-1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం (సెప్టెంబర్ 22) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగింది.

ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ, దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 31 శాతం దళితులకు, 17 శాతం ఎస్టీలకు కేటాయింపులు చేసి సంక్షేమంలో పెద్దపీట వేశామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉదయం పౌష్టికాహార బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని, 3.48 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తూ పేద కుటుంబాలకు, దళితులు, గిరిజనులకు నాణ్యమైన భోజనం చేరవేస్తున్నామని సీఎం చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల పట్టాలు ఎస్సీ, ఎస్టీలకు అందించిన స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, అత్యాచార ఘటనలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు అందాల్సిన నష్టపరిహార నిధులను బడ్జెట్ అడ్డంకులు లేకుండా ‘గ్రీన్ ఛానెల్’ ద్వారా తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మానవీయ కోణంలో ఇలాంటి సంఘటనలకు స్పందించాలని, షాబాద్ హత్య కేసు, తుక్కుగూడలో నర్సు అత్యాచార హత్య కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని సూచించారు.

విద్యా వికాసమే పేదరికాన్ని నిర్మూలిస్తుందని, పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని, రాజకీయాలకు అతీతంగా ఈ వర్గాల పురోగతికి అందరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు తగ్గుతున్నాయని అధికారులు నివేదించగా, కొన్ని జిల్లాల్లోని 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.

సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్లు, సభ్యులు, ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజూ, డీజీపీ సీవీ ఆనంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags: