Minister Sridhar Babu: హెల్త్ ఇన్నోవేషన్స్‌లో తెలంగాణను జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్‌బాబు
Minister Sridhar Babu: దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘కాంప్రహెన్సివ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ‘బియాండ్ నంబర్స్- ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ కేర్’ అనే అంశంపై నిర్వహించిన ‘హోమా సీఎంఈ 2026’ జాతీయ సదస్సును మంత్రి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఆధునిక జీవనశైలి కారణంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని, ఆ దిశగా నూతన ఆవిష్కరణలు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా.ముద్దు సురేంద్ర నెహ్రూ రచించిన ‘ది న్యూ పారాడైమ్’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్‌ప్లోరర్’ను ప్రారంభించారు. అలాగే ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీవోసీ)’ పేరిట ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఎంపిక చేసిన 50 మంది రోగులకు ఉచిత ప్రొటోకాల్‌ను అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు.