Singareni Collieries Company Limited (SCCL): సింగరేణి: నైనీ టెండరు రద్దు.. సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై విచారణకు సాంకేతిక కమిటీ
విచారణకు సాంకేతిక కమిటీ
Singareni Collieries Company Limited (SCCL): సింగరేణి కొల్లీరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వ్యవహారాల్లో జరుగుతున్న అనుమానాస్పద చర్యలపై కేంద్ర బొగ్గు శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ, మైనింగ్ డెవలప్‌మెంట్ ఆపరేటర్ (ఎండీఓ) ఎంపిక కోసం 2025 నవంబరు 28న జారీ చేసిన టెండరు ప్రక్రియ రద్దుకు దారితీసిన కారణాలు, అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద నిధుల వినియోగం జరిగిన తీరుపై సమగ్ర విచారణకు ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గురువారం ఉత్తర్వులు సింగరేణి సంస్థకు అందగానే, మధ్యాహ్నానికల్లా ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ సభ్యులు హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఉన్న సింగరేణి కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర శాఖ ఆదేశించడంతో విచారణ ఆగమేఘాలపై సాగుతోంది.
కమిటీ సభ్యులుగా కేంద్ర బొగ్గు శాఖలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) చేతన్ శుక్లా, సాంకేతిక విభాగం డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లును నియమించారు. నైనీ టెండరు, సీఎస్‌ఆర్ నిధుల మంజూరు, వినియోగానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలను వెంటనే సమర్పించాలని కమిటీ సింగరేణి అధికారులను ఆదేశించింది.
సింగరేణి ప్రధాన కార్యాలయం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఉండగా, కీలక నిర్ణయాలు హైదరాబాద్ కార్యాలయంలో తీసుకుంటారు. అందువల్ల పత్రాలను కొత్తగూడెం, ఇతర ప్రాంతాల నుంచి త్వరగా సేకరిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకుల సిఫార్సులతో సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
నైనీ టెండరు రద్దుకు కారణమైన పరిస్థితులను గుర్తించడమే కాకుండా, టెండరు దాఖలుకు గని సందర్శన (మైన్ విజిట్) సర్టిఫికెట్ ఎందుకు జారీ చేయలేదని కమిటీ ప్రశ్నించింది. ఈ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం సంబంధిత గని జనరల్ మేనేజర్‌కు ఉందని సింగరేణి అధికారులు వివరించారు. అయితే, ఈ నిబంధన పాటించకుండా కొందరికి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో, కోల్ ఇండియా, మహానది కోల్‌ఫీల్డ్స్ వంటి ఇతర బొగ్గు సంస్థల్లో ఇలాంటి నిబంధనలు ఎలా ఉన్నాయో కమిటీ సేకరిస్తోంది.
గతంలో టెండర్లలో గని సందర్శన సర్టిఫికెట్ నిబంధన లేకపోవడంతో ప్రైవేటు కంపెనీలు పనులు సరిగా చేయకపోవడం, దాంతో కోర్టు కేసులు రావడం వంటి సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఈ నిబంధనను జోడించినట్లు సింగరేణి అధికారులు వివరించారు. ఈ వివరణలో వాస్తవాలున్నాయా అనేది కూడా కమిటీ పరిశీలిస్తోంది.
కేంద్ర బొగ్గు శాఖ ఉత్తర్వుల్లో ప్రధాన అంశాలు:
నైనీ టెండరు రద్దుకు దారితీసిన కారణాల గుర్తింపు.
ఎండీఓ ఎంపిక, పనుల అప్పగింతలో సింగరేణి పద్ధతులను ఇతర బొగ్గు సంస్థలతో పోల్చి పరిశీలన.
సీఎస్‌ఆర్ నిధుల వినియోగం, మంజూరు ప్రక్రియలపై విచారణ.
తక్షణమే స్థలంలో విచారణ చేసి మూడు రోజుల్లో నివేదిక సమర్పణ.
ఈ విచారణతో సింగరేణి సంస్థలోని అనేక అంశాలపై స్పష్టత రావాలని భావిస్తున్నారు.