Kavitha: తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు: కవిత
కవిత
Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి బొగ్గు సమస్యలపై హరీశ్ రావు రూ.40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్ ప్రాంతంలో తిరుగుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి కూడా హరీశ్ రావు మాయలో పడ్డారని ఆరోపించారు. హరీశ్ రావు లేఖ రాయగానే కిషన్ రెడ్డి వెంటనే మరో లేఖ రాశారని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సింగరేణిలో పరిస్థితులు మారలేదని కవిత మండిపడ్డారు. కార్మికులపై యాజమాన్యం కర్కశంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నించే కార్మికులను అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వ అలసత్వమే కారణమని విమర్శించారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి పర్యటన చేపట్టినప్పటికీ కార్మికుల సమస్యలను తెలుసుకోలేదని ఆరోపించారు. భట్టి విక్రమార్క పర్సంటేజ్‌లు తీసుకోవడం మానేసి, ఆ తర్వాతే ప్రతిపక్షాలపై విమర్శలు చేయాలని సూచించారు.
ఓపెన్ కాస్ట్ మైన్స్‌తో సమానంగా అండర్ గ్రౌండ్ మైన్స్‌ను కూడా తెరవాలని డిమాండ్ చేశారు. దీంతో యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ 2012లో బొగ్గు స్కామ్ చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. సింగరేణి కూడా వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని తెలంగాణ బ్లాకులను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆదాయపన్ను సమస్యను పరిష్కరించాలని కోరారు.
బీజేపీ రాష్ట్రంలోకి వస్తే ఐటీ సమస్యలు పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారని, కానీ ఆ పార్టీ అధికారంలోకి రావడం లేదని, సింగరేణిలో కూడా గెలిచే అవకాశం లేదని కవిత వ్యాఖ్యానించారు. ‘పార్టీ పేరు విషయంలో మాకు క్లారిటీ ఉంది. కొత్త పార్టీపై ఫిర్యాదులు చేస్తున్నారంటే మేము బలంగా ఉన్నట్టే కదా’ అని కవిత స్పష్టం చేశారు.