SP Balasubrahmanyam Statue Unveiled: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ: రవీంద్రభారతిలో ఘనంగా కార్యక్రమం.. ప్రముఖుల హాజరు

రవీంద్రభారతిలో ఘనంగా కార్యక్రమం.. ప్రముఖుల హాజరు

Update: 2025-12-15 11:57 GMT

SP Balasubrahmanyam Statue Unveiled: ప్రముఖ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు వంటి ప్రముఖులతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

విగ్రహావిష్కరణ అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. భావి తరాలకు స్ఫూర్తిగా ఉండేలా రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. స్వర సార్వభౌముడిగా పేరొందిన బాలు ఎందరికో ఆదర్శవాదిగా నిలిచారని, ఆయన పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారని అన్నారు. నెల్లూరులో తన ఇంటిని వేద పాఠశాలకు దానం చేసిన బాలు ఔదార్యాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే ఈ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ఉద్యమకారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఉద్యమకారుడు పృథ్వీరాజ్‌లు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. విగ్రహావిష్కరణ సమయంలో నిరసన తెలపాలని చూసిన తెలంగాణ వాదులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు అన్ని భాషల ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రముఖులు కొనియాడారు.

Tags:    

Similar News