Minister Tummala Nageswara Rao: ‘SIR’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ) కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఈరోజు శనివారం ఖమ్మం నియోజకవర్గంలో SIR కార్యక్రమం అమలు పై ముఖ్య కార్యకర్తలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 3,02,800 ఓట్లు ఉన్నప్పటికీ, వాటిలో సగం ఓట్లు కూడా ఇంకా మ్యాపింగ్ కాలేదని వెల్లడించారు. దీంతో లక్ష న్నరకు పైగా ఓట్లు పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అప్రమత్తమై ప్రతి ఒక్క ఓటును కాపాడుకోవాలని కార్యకర్తలను, నాయకులను ఆదేశించారు. ఓట్లను కాపాడుకోలేకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మునుపటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్ల తేడాతోనే గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే SIR కార్యక్రమంలో 55 శాతానికి పైగా ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్రమత్తంగా లేకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నారు.

మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి నాయకులు ఓడిపోవడానికి కారణాలు గుర్తు చేసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలనుకునే వారికి ఇది జీవన్మరణ సమస్య అని వ్యాఖ్యానించారు. బీజేపీ తనకు అనుకూలంగా ఓట్లు తొలగిస్తోందని, మరో పార్టీ మరో రకంగా చేస్తోందని వస్తున్న ప్రచారాలను ప్రస్తావించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అధికారులతో సమన్వయం చేసుకొని ఓట్లను కాపాడుకోవాలని నేతలకు సూచించారు.

Tags: