CS Sanjay Jaju: ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ టీ-ఫైబర్ తప్పనిసరి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు
సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు
CS Sanjay Jaju: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అన్నారు. సచివాలయంలో సోమవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు వివరాలను స్పష్టంగా తెలిపే డాష్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నామని సీఎస్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలతో సహా అన్నింటికీ టీ-ఫైబర్ కనెక్టివిటీని తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, శాఖల పనితీరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రాయోజిత పథకాలపై మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు.
నవంబరు 14 నుంచి జరిగే ఖేలో ఇండియా క్రీడోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. క్యూర్ పరిధిలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ ఇంజిన్లు అమర్చే పథకాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
మీ-సేవ కేంద్రాలను మరింత పటిష్ఠపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. మీ-సేవ కేంద్రాల ఆధునికీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు, యువతకు ఐటీ ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై డిజిటల్-ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేశ్ ఉత్తమ్ చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో విస్తృతంగా చర్చించారు. దేశంలో డిజిటల్ రంగంలో పెట్టుబడులకు హరియాణా, తెలంగాణ అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొంటూ రూ.2,000 కోట్ల పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
టీ-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన సీఎస్, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని మరో సమావేశంలో ఆదేశించారు.