IT & Industries Minister Sridhar Babu: తయారీ రంగంలో తెలంగాణ ముందుండేలా.. జర్మన్ పెట్టుబడులకు ఆహ్వానం: ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

Update: 2026-07-11 07:09 GMT

IT & Industries Minister Sridhar Babu: తయారీ రంగంలో పరిశ్రమల స్థాపనకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.

పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, అధునాతన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో తెలంగాణను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు.

బవేరియన్ (జర్మనీ) మినిస్ట్రీ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్, రీజినల్ డెవలప్‌మెంట్ అండ్ ఎనర్జీ వైస్ మినిస్టర్ టోబియాస్ గోత్‌హార్ట్ నేతృత్వంలోని జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశంలో ‘తెలంగాణ-జర్మనీ’ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాలపై చర్చించారు.

పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వివరంగా తెలిపారు. పెట్టుబడులకు మాత్రమే కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కూడా తెలంగాణ-జర్మనీ భాగస్వామ్యాన్ని విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్, హైదరాబాద్‌లోని జర్మనీ కాన్సుల్ అమితా దేశాయ్, బవేరియా ఆర్థిక శాఖ ఈడీ ఉల్రికే హాఫ్‌మన్, బవేరియా ఇండియా కార్యాలయం ఈడీ జాన్ కొట్టాయిల్, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ డైరెక్టర్ సర్వేశ్‌సింగ్, ఐటీ శాఖ సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News