Telangana Governor Jishnu Dev Varma: గణతంత్ర దినోత్సవం: హైదరాబాద్ ఇమేజ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Telangana Governor Jishnu Dev Varma: రాజ్యాంగం దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి మూల విలువలను అందించిందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని ఆయన అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వివిధ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. భద్రతా బలగాల నుంచి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగం చేశారు.
"ప్రజా ప్రభుత్వం ఇటీవల తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్-2047ను విడుదల చేసింది. ఇది హైదరాబాద్ నగరం ఇమేజ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా రూపొందించబడింది. ఈ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్రానికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాం" అని గవర్నర్ తెలిపారు.
రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా విభజించి, మూడు కీలక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మేడారం అభివృద్ధికి రూ.251 కోట్లు కేటాయించామని తెలిపారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తోందని, గత ఏడాది బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాయని గుర్తుచేశారు. 26 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని, ధాన్యం బోనస్‌గా రూ.1,780 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గవర్నర్ గర్వంగా తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకొచ్చామని, గ్రూప్-1, 2, 3 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం 62 వేల ఉద్యోగాలను కల్పించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.