Telangana PCC President Mahesh Kumar Goud: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 16 మంది ఆశావహుల జాబితాను అందజేశారు. ఈ జాబితా ఆధారంగా ఏఐసీసీ బుధవారం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.

మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ గాంధీతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని వెల్లడించారు. పార్టీ నిర్మాణ బలోపేతంపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ అవగాహన కల్పించారన్నారు. పది రోజుల శిక్షణ తరగతుల్లో ఒకరోజుకు మించి గైర్హాజరైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 8 మంది డీసీసీ అధ్యక్షులకు సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది చోట్ల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని డీసీసీ అధ్యక్షులు ఫిర్యాదు చేశారని, ఈ అంశంపై దృష్టి పెట్టాలని రాహుల్ ఆదేశించగా, వెంటనే ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడానని మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు.

లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా పనిచేసిన మావోయిస్టులను ఆదరిస్తామన్నారు. పాకిస్థాన్‌తో చర్చలకు అంగీకరించిన ప్రధాని మోదీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదని విమర్శించారు.

సమర్థులైన నలుగురు బీసీలకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానం కోరడం లేదని తెలిపారు. ఈ నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామన్నారు.

గతంలో కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' పేరుతో మద్దతిచ్చే పార్టీలకు డబ్బు తానే పెడతానని చెప్పారని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలు తలో చేయి వేస్తే రూ. వెయ్యి కోట్లు వస్తాయని చెప్పారని, దీన్ని భారాస నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని వివరించారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు దొరికిపోయిందని, ఆ వ్యవహారంపై భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: