Tummala: భూమిని కాపాడే ఎరువులకే సబ్సిడీ ఇవ్వాలి.. తుమ్మల
తుమ్మల
తుమ్మల పని తీరు ఆదర్శనీయం: బీజేపీ ఎమ్మెల్యేలు
Tummala: రాష్ట్రంలోని మామిడి, మిర్చి తదితర పంట ఉత్పత్తులను విదేశాలు తిరస్కరిస్తున్నాయని, దీనికి ప్రధాన కారణం అధిక పురుగుమందుల వాడకమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియాకు సబ్సిడీ ఇస్తుండటంతో రైతులు అధికంగా వాడుతున్నారని, భూమిని సంరక్షించే ఎరువులకే రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరామని ఆయన అసెంబ్లీలో తెలిపారు.
గతంలో రాష్ట్రంలో 3 లక్షల టన్నుల కూరగాయలు పండేవని, ప్రస్తుతం దిగుబడి 72 వేల టన్నులకు పడిపోయిందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాలను పట్టించుకోలేదని, ప్రస్తుతం అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని మార్కెట్ల సమస్యలపై త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, కోహెడ మార్కెట్‌ను 170 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి దేశంలో తొలి ర్యాంకు సాధించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. 2023లో 37వ ర్యాంకులో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం 19వ స్థానానికి చేరుకుందన్నారు. డిచ్‌పల్లి, హుజూరాబాద్, వికారాబాద్, సూర్యాపేటల్లో 2,000 సీట్లతో కూడిన వ్యవసాయ కళాశాలలు మంజూరు చేస్తామని, 11 పాలిటెక్నిక్ కళాశాలల్లోని ఆరింటిని రద్దు చేశామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు తుమ్మల పని తీరును ప్రశంసించారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసిన తుమ్మల పని తీరు ఇతరులకు ఆదర్శనీయమని అన్నారు. ఆదివారం ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారని, ప్రతి ఎమ్మెల్యేకు గౌరవం ఇస్తారని కితాబు ఇచ్చారు. ఒక సమస్యపై ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో తిరిగి ఫోన్ చేసి ఆరా తీసి, పరిష్కారమయ్యేదాకా చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ఇతర మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలు తుమ్మలను ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
కూరగాయల సాగును పెంచేందుకు 95 శాతం సబ్సిడీతో కోల్డ్ స్టోరేజీలు, గోదాములు నిర్మించాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. రాష్ట్రం పీఎం పంటల బీమా పథకంలో చేరాలని, దీనికోసం రూ.3 వేల కోట్లు చెల్లించాలని కోరారు. పాలీహౌస్‌లకు గత 12 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే సబ్సిడీ ఇచ్చారని, అవసరమైన కూరగాయల్లో ఒక్క శాతం మాత్రమే పండిస్తున్నామని, పాల ఉత్పత్తి కూడా 8 శాతమే ఉందని ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.