Bhatti Vikramarka: రూ.2,500 కోట్లతో రాష్ట్రవ్యాప్త ఆలయాల ఆధునికీకరణ: భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, రూ.2,500 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నాచారం శ్రీ అద్భుత వేంకటేశ్వరస్వామి ఆలయాలను ఆదివారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్తో కలిసి దర్శించుకున్నారు. ఏన్కూరు నుంచి నాచారం కొండ వరకు రూ.44 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ భద్రాచలం రామాలయాన్ని రూ.276 కోట్లు, బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయాన్ని రూ.354 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆర్థికమంత్రిగా ఈ అభివృద్ధికి తానే నిధులు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ప్రజలు చైతన్యవంతులు కావాలని, ప్రతి నీటిచుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. విద్యుత్తు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నాచారం నుంచి ఉమ్మడి జిల్లాలను కలుపుతూ జూలూరుపాడు వరకు రహదారి మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా, మంజూరు చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.
సభ అనంతరం మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాల చెక్కులు అందించారు. సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, నాయకులు కొండబాల కోటేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.