Governor Shiv Pratap Shukla: తెలంగాణ రాష్ట్రంతో ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ (ఏకేడీఎన్‌) కొనసాగిస్తున్న అనుబంధాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించి బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా కోరారు.

లోక్‌భవన్‌లో గవర్నర్‌తో ఏకేడీఎన్‌ చైర్మన్‌, ఇస్మాయిలీ ముస్లింల 50వ వారసత్వ ఇమామ్‌ ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్‌, తెలంగాణకు ఆయన చేసిన తొలి అధికారిక పర్యటన సందర్భంగా గవర్నర్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశేష కృషి జరుగుతోందని అన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, పరిసరాల అభివృద్ధిలో ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. విద్య, పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్య సేవలు, మహిళా సాధికారత, ఉపాధి కల్పన తదితర రంగాల్లో సంస్థ చేస్తున్న కృషి స్థానిక సమాజాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తోందని అన్నారు.

హైదరాబాద్‌ సమీపంలోని ఆగాఖాన్‌ అకాడమీ ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలతో భవిష్యత్‌ తరాల నాయకులను తీర్చిదిద్దుతున్న సంస్థగా నిలుస్తోందని గవర్నర్‌ కొనియాడారు. ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ సమాజానికి మేలు చేసే శక్తిగా ఉందని, తెలంగాణ-ఏకేడీఎన్‌ మధ్య సహకారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మానవాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌ గవర్నర్‌కు వివరించారు. ముఖ్యంగా తెలంగాణలో పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్య సంరక్షణ, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో ఏకేడీఎన్‌ చేస్తున్న కృషిని వివరించారు.

రాష్ట్ర కళావైభవానికి ప్రతీకగా గ్రామీణ తెలంగాణ జీవనశైలిని ప్రతిబింబించే చేర్యాల నకాషీ చిత్రాన్ని, హంస ఆకృతితో రూపొందించిన కరీంనగర్‌ వెండి ఫిలిగ్రీ వీణను ఆగాఖాన్‌కు గవర్నర్‌ అందజేశారు.

Tags: