Deputy CM Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ పొదుపుపై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఈరోజు (బుధవారం) ఉదయం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో సీఐఐ – ఎనర్జీ ఎఫిషియెన్సీ కౌన్సిల్ నిర్వహించిన 25వ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ, ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే అవసరం లేకుండా పొదుపు చేసే విద్యుత్ యూనిటే చౌకైనదని అన్నారు. ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా చూడకూడదని, అది ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహమని తెలిపారు.
మెరుగైన మోటార్లు, శీతలీకరణ వ్యవస్థల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌తో వృథాను అరికట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్ తగ్గితే విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో పరిశ్రమలు, తయారీ, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు విద్యుత్ అవసరం మరింత పెరుగుతుందని వెల్లడించారు. తక్కువ పీక్ డిమాండ్‌తో ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌పై ఒత్తిడి తగ్గుతుందని, ఇంధన పొదుపుతో దేశానికి మరింత ఇంధన భద్రత ఏర్పడుతుందని అన్నారు.
భారత్‌లో మంచి పైలట్ ప్రాజెక్టులకు కొరత లేదని చెప్పిన భట్టి, పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్‌తో ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఏఐ సాయంతో విద్యుత్ వృథాను గుర్తించి వినియోగాన్ని మరింత సమర్థవంతం చేయాలన్నారు. భవిష్యత్తులో కర్మాగారాలు కేవలం వినియోగదారులుగా కాకుండా విద్యుత్ వ్యవస్థలో చురుకైన భాగస్వాములు కావాలని, ఇంధన సామర్థ్యాన్ని సంవత్సరానికి ఒకసారి చేసే ఆడిట్‌గా కాకుండా నిరంతర నిర్వహణ ప్రక్రియగా మార్చాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విద్యా సంస్థలు కలిసి పనిచేయాలని, స్థిరమైన అభివృద్ధికి ఇంధన సామర్థ్యమే అత్యంత ఆచరణాత్మక మార్గమని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు.