Tummala: తుమ్మల: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ప్రదర్శనలు.. సిద్దిపేటలో త్వరలోనే భారీ ఏర్పాటు

సిద్దిపేటలో త్వరలోనే భారీ ఏర్పాటు

Update: 2026-02-23 04:52 GMT

Tummala: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వివిధ పంటల సాగు పద్ధతులు, విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్ర పరికరాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శనలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. త్వరలోనే సిద్దిపేట జిల్లాలో భారీ స్థాయిలో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని, అలాగే పొలాల్లో క్షేత్రస్థాయి సందర్శనలను విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రైతుబడి వ్యవసాయ ప్రదర్శనను మంత్రి తుమ్మల సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, స్టాళ్ల యజమానులు, రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను ఎంచుకుని సాగు చేస్తే రైతులు ఆర్థికంగా లాభపడతారు. తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువగా ఉన్నందున, వాటికి తగిన యంత్రాలను సబ్సిడీతో అందుబాటులోకి తెస్తాం. ఆయిల్‌పామ్ సాగు రైతులకు అన్ని విధాలా లాభదాయకమని, అంతర పంటగా కూడా దీన్ని చేయవచ్చు. వర్షాలు, కోతులు వంటి సమస్యలు లేకుండా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ వ్యవసాయ ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌తోపాటు పలువురు రైతులు, నగరవాసులు ఈ ప్రదర్శనను సందర్శించి వివిధ స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులు, యంత్రాలపై అవగాహన పొందారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు.

Tags:    

Similar News