Minister Uttam: జల సంరక్షణతో గ్రామాల్లో భారీగా ఉపాధి అవకాశాలు.. జనవరి నుంచి కార్యాచరణ: మంత్రి ఉత్తమ్
మంత్రి ఉత్తమ్
Minister Uttam: జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ఉపాధి కల్పన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యాచరణ సిద్ధం చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వచ్చే జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ‘‘రాబోయే వర్షాకాలానికి ముందుగా ఆరు నెలలపాటు చేపట్టే ఈ కార్యక్రమాన్ని నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా అమలు చేస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ కూలీలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తాం. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ఉంటుంది. దీన్ని అవకాశంగా మలుచుకొని దీర్ఘకాలం ఉపయోగపడేలా అధికారులు జలవనరులను సృష్టించాలి. ఉన్న సాగునీటి సదుపాయాలను బలోపేతం చేయాలి. భూగర్భ జలాల లభ్యతను మెరుగుపరచేలా పనుల ప్రణాళిక ఉండాలి’’ అని అన్నారు.
ఇప్పటికే 355 రకాల పనులతో సమగ్ర జాబితా సిద్ధమైందని, ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఈ కార్యాచరణ ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమయ్యే అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుతుందని చెప్పారు. భూగర్భ జలాల పెంపుదల విషయంలో రాజస్థాన్, మహారాష్ట్రలలో అధ్యయనం చేయాలని, తెలంగాణ పరిస్థితులకు అనువైన విధానాలను గుర్తించి కార్యాచరణలో పొందుపరచాలని సూచించారు. భూగర్భజలాల పరిస్థితి, ప్రస్తుతం చేపడుతున్న చర్యలు, భవిష్యత్తు అవసరాలపై సమీక్షించేందుకు జిల్లాస్థాయి భూగర్భజల శాఖ అధికారులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కూడా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమానికి ఆకర్షణీయమైన పేరు సూచించాలని అధికారులను కోరారు.