CM Revanth Reddy : తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి

Update: 2026-06-03 10:10 GMT

CM Revanth Reddy : తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వెల్లడించారు.

ఈరోజు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. అధికారిక పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా బృందం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సమావేశంలో పెట్టుబడుల అవకాశాలపై విస్తృత చర్చ జరిగింది.

సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి దామోదర రాజనరసింహ, సీఎస్ రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్యం, పారిశ్రామిక రంగం, పెట్టుబడుల సంబంధాలను మరింత బలపరచే అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సమాచార సాంకేతికత (ఐటీ), తయారీ, మౌలిక సదుపాయాలు, ఫార్మా, వ్యవసాయం వంటి రంగాల్లో పరస్పర సహకార అవకాశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్న దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ తెలంగాణ ప్రత్యేకతలని వివరించారు.

దక్షిణాఫ్రికా కంపెనీలు తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ కూడా తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక రంగ పురోగతిపై ఆసక్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో మరింత సహకారం కొనసాగించాలని ఇరు పక్షాలు సానుకూలంగా స్పందించాయి.

Tags:    

Similar News