CM Revanth Reddy: ‘ఎస్‌ఐఆర్‌’ కుట్రలను అడ్డుకుంటాం.. భాజపాను అధికారంలోకి రానీయం: సీఎం రేవంత్‌ రెడ్డి

భాజపాను అధికారంలోకి రానీయం: సీఎం రేవంత్‌ రెడ్డి

Update: 2026-05-09 11:55 GMT

హిందూ-ముస్లిం ఇద్దరూ రెండు కళ్లు... మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి

CM Revanth Reddy: ఓటరు సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌) పేరిట తెలంగాణను ఆక్రమించుకోవాలని భాజపా చేస్తున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి రానీయబోమని హెచ్చరించారు.

హజ్‌ యాత్రికుల బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం నాంపల్లి హజ్‌ హౌస్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "హిందూ, ముస్లింలు ఇద్దరూ నా రెండు కళ్లు. వారు సోదరుల్లాగే సమానులు" అని ఆయన పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆపద సమయంలో ఎప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు.

గత పదేళ్లుగా రాష్ట్రాన్ని నడిపిన నాయకులు ఇప్పుడు రాత్రి కాగానే ఎవరితో మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో ఎస్‌ఐఆర్‌ పేరిట జరిగిన అక్రమాలు తెలంగాణలో సాగనివ్వమని రేవంత్‌రెడ్డి హెచ్చరిక జారీ చేశారు.

హజ్‌ యాత్రికులకు సహాయం

ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కేంద్రం హజ్‌ యాత్రికులపై రూ.10 వేల అదనపు భారం మోపడంతో ఆ ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ నుంచి వెళ్తున్న యాత్రికులు తెలంగాణను నంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రార్థనలు చేయాలని కోరారు.

మైనార్టీలకు ప్రత్యేక పథకాలు

రెండేళ్లుగా మైనార్టీల సంక్షేమం, విద్య, ఉద్యోగాల్లో ప్రభుత్వం భారీగా కృషి చేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మైనార్టీలు 9.5 శాతం వాటా సాధించారని, గ్రూప్-1, 2, 3 ఉద్యోగ నియామకాల్లో ఈ వాటా ఉన్నట్లు వివరించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు.

క్రైస్తవ విద్యార్థులకు ప్రత్యేకంగా 100 విదేశీ ఉపకారవేతనాలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారిస్తున్నామని, ఏటీసీలో చదువుతున్న యువతకు నెలకు రూ.2 వేల ఉపకారవేతనం అందిస్తున్నట్లు చెప్పారు.

ఆటోల ఎలక్ట్రిక్‌ రూపాంతరం

హైదరాబాద్‌లోని 2 లక్షల డీజిల్‌ ఆటోలను ప్రభుత్వ ఖర్చుతో ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మీరాలం చెరువుపై రూ.500 కోట్లతో సస్పెన్షన్‌ బ్రిడ్జి, గౌలిగౌడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు సేవలు తీసుకురావాలని ప్రణాళికలు వివరించారు.

మంత్రి అజారుద్దీన్‌ మాట్లాడుతూ హజ్‌ యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఎలాంటి సమస్య ఎదురైనా ప్రభుత్వం, ఎంబసీ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి షఫీయుల్లా, సలహాదారు షబ్బీర్‌ అలీ, తెలంగాణ హజ్‌ కమిటీ ఛైర్మన్‌ ఖుసుర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News