Minister Sridhar Babu: తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎంతో చర్చిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్‌బాబు
Minister Sridhar Babu: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు చేస్తున్నామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “మేం పని చేసుకుంటూ వెళ్తాం. ప్రచారాల గురించి పట్టించుకోం” అని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని, సరళతర పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరుల కారణంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది 100 జీసీసీలు రావాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 40 వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిన ఆర్థిక వ్యవస్థను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమర్థంగా నడిపిస్తున్నారని అన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి పలుమార్లు ఆహ్వానం పంపారని, సభకు వస్తే ఆయన మర్యాదకి ఇబ్బంది రానివ్వం అని చెప్పారు. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేది ముఖ్యమని, తాము నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి అది మా ఖాతాలో వేయాలంటే ఎలా అని ప్రశ్నించారు.