BRS MLA Harish Rao : యూరియా అడిగినందుకు రైతు చెంపపై కొడతారా-హరీష్ రావు
వ్యవసాయ శాఖ కమిషనరేట్ ముందు ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు;
యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన… ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్‌రావు నిలదీశారు. శనివారం అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే అగ్రికల్చర్ కమిషనర్ కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చి కమిషనరేట్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నాకి దిగారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిసిన విద్యలు రెండే అవి మూటలు మోయడం… మాటలు మార్చడమని హరీష్ రావు తవ్రంగా విమర్శించారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి తప్పుదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో యూరియా కొరతే లేదన్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రతిపక్షాలు ఫేక్ ప్రచారం చేస్తున్నాయని మొదటి నుంచి ప్రభుత్వం ఎదురు దాడి చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూలైన్లో నిలబడాల్సిన అవసరమే లేదని అవాస్తవాలు చెప్పారన్నారు. తరువాత క్యూలైన్ల విజువల్స్ వస్తే వారు రైతులే కాదన్నారని చివరికి ఇప్పుడు యూరియా కొరత నిజమేనని ప్రభుత్వం ఒప్పకోవాల్సిన పరిస్ధితి వచ్చిందని హరీష్ రావు విమర్శించారు. అయితే యూరియా కొరతకు కారణం కేంద్రానిదని, బీజేపీదని, రష్యా ఉక్రెయిన్ వార్ వల్లే అని ప్రభుత్వం కుంటి సాకులు చెపుతోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత యుద్దం వల్ల కాదని కాంగ్రెస్ సిద్దంగా లేకపోవడం వల్ల వచ్చిందన్నారు. యూరియా కోసం వచ్చిన రైతులపై చేయి చేసుకున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా చేయడంలో విఫలమైన రేవంత్ సర్కర్ రైతాంగం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా వ్యవసాయశాఖ కమిషనరేట్ ముందు నుంచి కదిలేది లేదంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. దీంతో ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.