ZPTC and MPTC Elections: జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలు మేలోనే.. ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం ఉత్తర్వులు!
ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం ఉత్తర్వులు!
ZPTC and MPTC Elections: రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మే నెలలోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం 10.07.2025 నుంచి 05.02.2026 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాలోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలతో జత చేయాలని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఈ ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజా ఆదేశాలు ఇచ్చింది. జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరణ తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) యూజర్ మాన్యువల్ ప్రకారం ఈ జాబితాలను పోలింగ్ కేంద్రాలతో అనుసంధానం చేయాలని సూచించింది. డేటాలో ఏవైనా వ్యత్యాసాలు గమనించినట్లయితే ఈ నెల 23వ తేదీలోగా ఎన్నికల సంఘానికి నివేదించాలి. ఆ తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా విడుదల చేసి, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించి తుది జాబితా విడుదల చేస్తారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర ఏర్పాట్లు పూర్తి చేస్తారు.
గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీల్లో జరిగాయి. జూన్‌లో ఎంపీపీ, జడ్పీ ఛైర్‌పర్సన్లను ఎన్నిక చేశారు. గత ఏడాది జూన్‌తో వారి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. వాస్తవానికి గత సెప్టెంబరు 29న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ సందర్భంగా అక్టోబరు 9న ఆదేశాల మేరకు ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల ఎన్నికలు జరిపారు. రిజర్వేషన్ల విధానం ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా మే నెలలో హైకోర్టు అనుమతితో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.
పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల జాబితాను రూపొందించి ఎన్నికల సంఘానికి సమర్పించింది. మొత్తం 566 జడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలు, ఆ మేరకు మండల ప్రజాపరిషత్ ఛైర్‌పర్సన్ల (ఎంపీపీ) స్థానాలు ఖరారు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్‌ల జాబితా నుంచి దాన్ని తొలగించారు. ప్రస్తుతం మొత్తం 31 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. 2019 తర్వాత పురపాలికలు, నగరపాలికల్లో అనేక గ్రామపంచాయతీలు విలీనమవడంతో గ్రామాల సంఖ్య తగ్గింది. దీంతో 44 ఎంపీటీసీలు, నాలుగు జడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాలు తగ్గాయి.
ఈ ఎన్నికలతో స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.