మార్కెటింగ్ చేసుకోవడం తప్ప చంద్రబాబు మేలు చేయడు : మాజీ మంత్రి కన్నబాబు
Former Minister Kannababu Accuses Chandrababu of Betraying Farmers “Chandrababu Good Only at Self-Promotion, Not Public Welfare”: Kannababu
- మార్కెటింగ్ చేసుకోవడం తప్ప చంద్రబాబు మేలు చేయడు
: మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం
అబద్ధాలు, క్రెడిట్ చోరీలతో తనను తాను మేథావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప, రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదని ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. వైయస్సార్ కడప జిల్లాలో రెండో విడత అన్నదాత సుఖీభవ నగదు జమ సందర్భంగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై మండిపడ్డారు. ఈ ఒక్క పథకం ద్వారా రెండేళ్లలో రైతులకు దాదాపు రూ. 17 వేల కోట్లు మోసం చేశాడని వివరించారు. ఏకంగా 7 లక్షల మంది రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కేంద్రం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకి ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానని నమ్మించి తీరా గెలిచాక రెండేళ్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడని ధ్వజమెత్తారు.
● పంచ సూత్రాలు కాదు.. పచ్చి అబద్ధాలు
మార్కెటింగ్ చేసుకునే సామర్థ్యం తప్ప, ప్రజలకు మేలు చేసే ఆలోచన లేని నాయకుడు దేశంలో చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. ప్రపంచంలో ఏదైనా బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని దానిపై ఆయన ముద్రేసుకుని దానికి సృష్టికర్త తానే అన్నట్టు ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకి అలవాటు. వైయస్సార్సీపీ హయాంలో నాటి సీఎం వైయస్ జగన్ ప్రారంభించిన వైయస్సార్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చిన చంద్రబాబు వైయస్సార్ కడప జిల్లాలో రెండో విడత నిధులు పంపిణీ కార్యక్రమం చేపట్టాడు. ఈ క్రాప్ చేయడం చేతకాని వ్యక్తి వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తీసుకొస్తానని చెబుతున్నాడు. గడిచిన ఐదేళ్లూ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత మాజీ సీఎం వైయస్ జగన్ గారిదైతే, అకౌంట్‌లో నగదు చేసే విధానం నేనే తీసుకొచ్చానని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నాడు.
● వైయస్ జగన్ చేసిన పనులు చెప్పి క్రెడిట్ చోరీ
ఎంతసేపటికీ పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే రైతులకు మేలు చేసే మాట ఒక్కటీ చెప్పలేకపోయాడు. వైయస్సార్సీపీ హయాంలో సీఎంయాప్‌ను తీసుకొచ్చి రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేస్తే చంద్రబాబు కొత్తగా యాప్ తీసుకొస్తానని చెబుతున్నాడు. వైయస్ జగన్ చేసిన మంచి పనులకు తన స్టాంప్ వేసుకుని క్రెడిట్ చోరీ చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు. గడిచిన ఐదేళ్లలో రైతులకు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిందో సీఎం చంద్రబాబు స్టడీ చేసుంటే ప్రతిదీ కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పుకునేవాడు కాదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయస్సార్సీపీ నాయకుల మీద కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. చంద్రబాబు ఇప్పటికైనా అబద్ధాల మార్కెటింగ్ మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.