CM Chandrababu Naidu: స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి 59 పిటిషన్లు.. ఏపీ బ్రాండ్‌పై ఆందోళన కలిగిస్తున్న జగన్ చర్యలు: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేందుకు వైఎస్సార్సీపీ 59 పిటిషన్లు వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు, కేంద్ర నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉండవల్లిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌పై ఆందోళన కలిగించేలా జగన్ చర్యలు ఉన్నాయని ఆరోపించారు.
‘‘గతంలో శాంతిభద్రతల సమస్య బాహ్య శక్తుల నుంచి వచ్చేది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నుంచే వస్తోంది. నేతలు నేరాలు చేస్తూ శాంతిభద్రతల సమస్యలు సృష్టించిన రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదు. 2019-24 మధ్య విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. తెలుగు జాతి మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితిని గత వైకాపా పాలకులు తెచ్చారు. నేరాలు, రౌడీయిజం చేసేవారిని ప్రజలు హర్షించరు’’ అని చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఇస్తారని, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజం, ఫ్యాక్షనిజం, కమ్యూనలిజాన్ని తాను నియంత్రించానని, హైదరాబాద్‌లో నెల రోజులు కర్ఫ్యూ ఉన్నప్పటికీ దాన్ని అదుపులోకి తెచ్చానని గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అరాచకం రాజ్యమేలిందని, అన్ని రకాల అరాచకాలు చేశారని, తనను కూడా నోటీసు లేకుండా అరెస్టు చేశారని విమర్శించారు. ఇలాంటి అరాచకాల వల్లే 2024లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారన్నారు.
స్థానిక ఎన్నికలు జరగకపోతే 16వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే కేంద్ర నిధులు రావని, అవి రాకపోతే స్థానిక సంస్థల్లో అభివృద్ధి జరగదని సీఎం వివరించారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బీసీలకు సీట్లు ఇచ్చామని తెలిపారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడామని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నామని, కరవును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. రాయలసీమ రైజింగ్, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని పునర్నిర్మించి బ్రాండ్ ఇమేజ్ పెంచామని అన్నారు. 96 కేంద్ర పథకాల నిధులను గత ప్రభుత్వం మళ్లించిందని, తాము వచ్చాక సరిదిద్దామని వెల్లడించారు.
‘‘కాంగ్రెస్, వైఎస్ మనస్తత్వంతో పోల్చితే జగన్‌ది భిన్న మనస్తత్వం. ఆయన మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం. ఫేక్ ప్రచారం చేసి కోర్టులకు వెళ్తూ క్రిమినల్ లిటిగెంట్లుగా మారుతున్నారు. కోర్టులకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గత రెండున్నరేళ్లలో వైసీపీ జిల్లాలకు వెళ్లి అరాచకాలు చేసిందని, రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పంజాబ్ నుంచి క్రిమినల్స్, మారణాయుధాలు తీసుకువచ్చి అల్లర్లు సృష్టించారని, దర్శిలో పోలీసులపై దాడి చేశారని, పులివెందుల, పుంగనూరు వంటి ప్రాంతాల్లో హింస సృష్టించారని ఆయన తెలిపారు. ఒక ఎంపీ వాహనాలు పంపి టీడీపీ కార్యకర్తలను తొక్కించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జగన్ పార్టీ చేస్తున్న హింస, అబద్ధాలు, అరాచకాలపై ప్రజల్లో చర్చ జరగాలని సీఎం కోరారు.