Zilla Parishad Chairperson Posts: స్థానిక సంస్థల ఎన్నికలను తమ వారసుల రాజకీయ భవిష్యత్తుకు తొలి మెట్టుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. కీలకమైన జిల్లా పరిషత్ (జడ్పీ) ఛైర్‌పర్సన్ స్థానాలపై చాలామంది కన్నేసారు. పొత్తు కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రానివారు, వివిధ సమీకరణాల వల్ల ఇప్పటివరకు ఏ పదవీ దక్కని నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారు. జడ్పీ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వ్ అయిన చోట భార్యలు, కుమార్తెలు, కోడళ్లను రంగంలోకి దించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వీరికి అవకాశాలపై ఇంకా స్పష్టత రాకపోయినా, జడ్పీ ఛైర్‌పర్సన్ పదవులు ఆశిస్తున్న తెదేపా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

విజయనగరం జడ్పీ ఛైర్మన్ పదవిని తన కుమారుడు రామ్‌మల్లిక్ నాయుడికి ఇవ్వాలని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు ఆశించారు. అయితే ఆ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో తన కోడలు సంధ్యను బరిలోకి దించుతున్నారు. మార్క్‌ఫెడ్ ఛైర్‌పర్సన్ కర్రోతు బంగార్రాజు తన కుమార్తె చంద్రకళకు అవకాశం ఇవ్వాలని పార్టీని కోరుతున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం లోక్‌సభ, నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ల కోసం గట్టిగా ప్రయత్నించి నిరాశ చెందిన డెంకాడ మాజీ జడ్పీటీసీ సభ్యుడు కంది చంద్రశేఖర్ తన భార్య రమాదేవిని ఛైర్‌పర్సన్ చేయాలని కోరుతున్నారు. వీరు ముగ్గురూ జడ్పీటీసీ స్థానాలకు ఇప్పటికే నామినేషన్లు వేశారు.

ఏలూరు జడ్పీ ఛైర్‌పర్సన్ పీఠాన్ని తన సతీమణి పద్మావతికి ఇవ్వాలని మాజీ ఎంపీ మాగంటి బాబు కోరుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కుమార్తె నవ్యశ్రీని ఆ స్థానంలో చూసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మూడు సార్లు నూజివీడు టికెట్ ఆశించి భంగపడ్డ అట్లూరి రమేశ్ తన సతీమణి రాధికకు ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి కుమార్తె జాహ్నవి పేరు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఏలూరు జడ్పీ స్థానాన్ని జనసేన, భాజపా కూడా గట్టిగా కోరుతున్నాయి.

కృష్ణా జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిని తన భార్య జయలక్ష్మికి ఇవ్వాలని అవనిగడ్డ తెదేపా ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావు అడుగుతున్నారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.కల్యాణి కూడా రేసులో ఉన్నారు. తమ కుటుంబంలో ఒకరికి ఆ పదవి దక్కాలని ఆశిస్తున్న మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

నెల్లూరు జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి ఇప్పించేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు మేయర్ స్థానానికి తెదేపా అభ్యర్థిత్వం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వర్గానికి దక్కడంతో జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాన్ని విడిచిపెట్టకూడదని కోటంరెడ్డి సోదరులు పట్టుదలగా ఉన్నారు. ఉదయగిరి ఏఎంసీ మాజీ ఛైర్‌పర్సన్ వెంకట్‌రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నారు.

కర్నూలు జడ్పీ ఛైర్‌పర్సన్ పదవికి తన కుమారుడు రుద్రఫణిని బరిలో దించాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ భావిస్తున్నారు. వాల్మీకి బోయ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బొజ్జమ్మ కూడా ఈ పదవి ఆశిస్తున్నారు.నంద్యాల జడ్పీ పీఠాన్ని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోదరుడు రాజారెడ్డి ఆశిస్తున్నారు. సిరివెళ్ల మండల తెదేపా కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మద్దతు ఉన్నట్లు సమాచారం.

అనకాపల్లి జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాన్ని తెదేపా, జనసేన నుంచి పలువురు ఆశిస్తున్నారు. తెదేపా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు తన భార్య అరుణను జడ్పీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి నిరాశ చెందిన ఆయన, జడ్పీ పదవైనా తమకు కేటాయించాలని అడుగుతున్నారు. కొప్పులవెలమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పీవీజీ కుమార్ తన సతీమణి, మాజీ ఎంపీపీ సత్యవతికి జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానం కేటాయించాలని కోరుతున్నారు. ఇదే స్థానానికి జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ లాలం భవాని, దేవరాపల్లి మాజీ ఎంపీపీ భార్య రాజేశ్వరి కూడా ప్రయత్నిస్తున్నారు. జనసేన నుంచి ఆ పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సుందరపు సతీష్ తన సతీమణికి ఈ పదవి ఇవ్వాలని కోరుతున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా తన కుమార్తె తేజశ్వికి అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరుతున్నారు. సింహాచలం దేవస్థానం బోర్డు సభ్యురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, 2024లో పాడేరు తెదేపా టికెట్ ఆశించిన కిల్లు రమేశ్‌నాయుడు తల్లి, మాజీ సర్పంచి వెంకటరత్నం తదితరులూ రేసులో ఉన్నారు. జనసేన పాడేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంగులయ్య కూడా ఆ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్థానాన్ని రాజోలు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య ఆశిస్తున్నారు. ఆమె మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె. కాకినాడ జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్నవారిలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులున్నారు. పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ పదవికి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉప్పలపాటి సురేశ్‌బాబు, స్థానిక తెదేపా నాయకుడు కలిదిండి రామచంద్రరావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి వీవీఎల్ నరసింహరాజు ఆశిస్తున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ బరిలో దిగే అవకాశం ఉంది. అగ్రనాయకత్వం సరేనంటే ఆయన శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. పల్నాడు జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి కోసం తెదేపా రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము తన కుమార్తె కీర్తనను బరిలో దించుతున్నారు. పిడుగురాళ్లకు చెందిన వైద్యురాలు ఉన్నం దీపిక కూడా ఆశిస్తున్నారు. మార్కాపురం జడ్పీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిత్వాన్ని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి తమ్ముడు రామిరెడ్డి ఆశిస్తున్నారు. ప్రకాశం జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ సోదరుడు అనిల్, ఎద్దు ప్రశాంత్‌భూషణ్, అయినంపూడి రమేశ్‌లు పోటీ పడుతున్నారు. కడప జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తండ్రి, తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి ఆశిస్తున్నారు. జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన సమీప బంధువు రాజేష్‌రెడ్డి కోసం ప్రయత్నిస్తున్నారు.

చిత్తూరు జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాన్ని మమతశ్రీ ఆశిస్తున్నారు. ఆమె భర్త తెదేపా నాయకుడు, వ్యాపారవేత్త, మాజీ ఎంపీపీ సుచిత్ర జయప్రకాశ్, విజయం సంస్థల యజమాని శైలజా తేజోమూర్తి కూడా రేసులో ఉన్నారు. తిరుపతి జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిలో తన కుమార్తె చేతనను కూర్చోబెట్టాలని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆశిస్తున్నారు. మాజీ మంత్రి పరసా రత్నం కూడా తన కుమార్తె శాలిని కోసం ప్రయత్నిస్తున్నారు. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత తన కుమార్తె డాక్టర్ హెలెన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు.మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాల కోసం తెదేపా సీనియర్ నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.

Tags: