Seat-Sharing: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై కూటమి పార్టీల మధ్య చర్చలు వేగంగా సాగుతున్నాయి. మూడు పార్టీల నేతలు రెండు రోజులుగా ఈ అంశంపై విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు.


గురువారం ఒంటరిగా చంద్రబాబు నివాసానికి వెళ్లి సీట్ల సర్దుబాటుపై చర్చించిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం మరోసారి వెళ్లారు. ఇద్దరి మధ్య రెండో విడత చర్చలు జరిగాయి.


జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాజపాకు ఇచ్చే స్థానాలపై ఒక స్పష్టత వచ్చింది. 30 జడ్పీటీసీ, 30 ఎంపీపీలతో పాటు వందకు పైగా ఎంపీటీసీ స్థానాలు ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. మొత్తం స్థానాల్లో భాజపాకు 5 శాతం వరకు ఇచ్చేలా చర్చలు నడుస్తున్నాయి.


జనసేనకు 30 శాతం స్థానాలు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ తొలుత ప్రతిపాదించారు. తెదేపా నుంచి కూడా పోటీ ఎక్కువగా ఉందని, పునరాలోచించాలని సీఎం చంద్రబాబు ఆయనకు సూచించినట్లు తెలిసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు చర్చల నాటికి సీట్ల పంపిణీలో అంతరం కొంత తగ్గింది. అయితే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.


9 జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాలు కావాలని జనసేన కోరుతోంది. తెదేపా నుంచి కూడా చాలామంది ఆశిస్తున్నారని చంద్రబాబు వివరించినట్లు సమాచారం. మధ్యేమార్గంగా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఏజెన్సీలోని అల్లూరి జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలిసింది.


జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు అధ్యక్ష ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులే వారిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎవరెన్ని స్థానాల్లో, ఎక్కడ పోటీ చేయాలనే అంశంపైనే కసరత్తు చేస్తున్నారు. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉపసంహరణ గడువు ముగిసేలోపు ఓ కొలిక్కి తేనున్నారు.


ఇందులో జిల్లా నాయకులతో పాటు ఎమ్మెల్యేలదే ముఖ్యపాత్ర అవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే కొన్నిచోట్ల ఎమ్మెల్యేల స్థాయిలోనే చర్చించి ఏ పార్టీకి ఎన్ని స్థానాలో నిర్ణయించి అందుకు అనుగుణంగా నామినేషన్లు వేయించారు. చాలాచోట్ల కొలిక్కి రాకపోవడంతో మూడు పార్టీల నుంచి ఆశావహులు భారీగా నామినేషన్లు వేశారు. పొత్తుపై స్పష్టత రాగానే మిగిలిన రెండు పార్టీల అభ్యర్థులు ఉపసంహరించుకునేలా సమన్వయ కమిటీలు చూస్తాయి.

Tags: