CM Chandrababu: జిల్లాల్లో 80% ఉద్యోగుల పనితీరు సంతృప్తికరం.. 40 వేల మంది ఉద్యోగులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

40 వేల మంది ఉద్యోగులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

Update: 2026-05-19 08:30 GMT

నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లా కలెక్టర్లు టాప్-3లో

CM Chandrababu: రాష్ట్రంలోని జిల్లాల్లో 80 శాతం ఉద్యోగులు మంచి పనితీరు చూపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకం గణనీయంగా పెరిగిందని, ఫీడ్‌బ్యాక్ గణాంకాలే దీనికి సాక్ష్యమని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌ను అన్ని స్థాయుల్లో అమలు చేయాలని సూచించారు.

సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి సోమవారం 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు కూడా మాట్లాడే అవకాశం కల్పించారు. గృహనిర్మాణం విషయంలో మంచి సూచనలు చేసిన కాకినాడ జిల్లా ఉద్యోగిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. వైకాపా పాలనలో విధ్వంసం చెందిన రాష్ట్రాన్ని ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో సరైన గాడిలో పెట్టామని చంద్రబాబు తెలిపారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం ప్రజలతో సఖ్యంగా మెలగడం వల్లే సాధ్యమైందన్నారు.

పథకాల అమల్లో అప్రమత్తం:

పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించాలని సీఎం ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను 100 శాతం పరిష్కరించాలని, ఎక్కడా అవినీతి చోటు చేసుకోకూడదని హెచ్చరించారు. అందరూ బృందంగా పని చేయాలని, వేసవిలో తాగునీటి సమస్యలు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈవీ వాహనాల వినియోగం ఉద్యమ స్థాయికి:

ఈ సందర్భంగా ఈవీ కంపెనీల ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించాలని, ఈవీ వాహనాల కొనుగోలుకు రుణాలు, ఈఎంఐ సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

ఏఎంసీఏ ప్రాజెక్టుపై జాతీయ స్థాయి చర్చ:

అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు 36 రోజుల్లో అనుమతులు ఇచ్చి శంకుస్థాపన చేశామని, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని చంద్రబాబు వివరించారు. ప్రతి ఉద్యోగి పనితీరును విశ్లేషిస్తున్నామని, మంచి పని చేసేవారిని గుర్తించి గౌరవిస్తామని తెలిపారు.

ఈ టెలికాన్ఫరెన్స్‌లో కింది స్థాయి ఉద్యోగులతో నేరుగా మాట్లాడటం, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News