AP Cabinet Decision: మచిలీపట్నంలో రూ.8 వేల కోట్ల నౌకా నిర్మాణ కేంద్రం.. మంత్రిమండలి కీలక నిర్ణయాలు
కీలక నిర్ణయాలు
AP Cabinet Decision: కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు 400 ఎకరాలు కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడితో బ్రౌన్ ఫీల్డ్ నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రక్షణ, కోస్ట్‌గార్డు నౌకలతోపాటు వాణిజ్య, ఎగుమతి నౌకలను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.
స్వర్ణ వార్డు సచివాలయాల్లో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2), ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2) పోస్టులకు పదోన్నతి అవకాశాలు కల్పించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఎంట్రీ లెవల్ పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ప్రమోషన్ ఛానల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రత్యేక సర్వీస్ నిబంధనలు జారీ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ రూపకల్పనకు ఆమోదం తెలిపారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కూడా ఆమోదించారు.
రాష్ట్రంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహారశుద్ధి, పర్యాటక రంగాల్లో రూ.22,177.84 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా 19,739 మందికి ఉపాధి లభించనుంది. గడువులోగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించకపోతే రద్దు చేయాలని నిర్ణయించింది. రెడ్‌జోన్ ప్రాంతాల్లోనే కాలుష్యకారక ఆహారశుద్ధి పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఫోటాన్‌కోర్ సిస్టమ్స్, వెరిడేటా హెల్త్, క్వాన్‌ఫ్లూయెన్స్, ట్రైక్వాంటా ల్యాబ్స్ తదితర ప్రాజెక్టులకు భూమి, కార్యాలయ స్థలం, ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
విశాఖ జిల్లాలో డెలాయిట్ టచ్ తోమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీ రూ.43.75 కోట్ల పెట్టుబడితో ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇది 2,500 ఉద్యోగాలు కల్పించనుంది. అదే విశాఖలో ఏఐ ఇంటిగ్రేటెడ్ హబ్ కోసం ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌కు 3 ఎకరాలు కేటాయించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. ఈ సంస్థ రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి 2,400 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
తిరుపతిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో వేదిక్ కల్చర్ అండ్ స్పిరిచువల్ సెంటర్ ఏర్పాటుకు పెదబంగారునాదం, బెవనపల్లె గ్రామాల్లో 8.25 ఎకరాల కేటాయింపుకు ఆమోదం తెలిపారు. అమరావతిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకు గతంలో కేటాయించిన రూ.904 కోట్లకు బదులు రూ.1,548.98 కోట్లతో సవరించిన అంచనాలకు పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. భూ సమీకరణ పథకం కింద ఎకరం కంటే తక్కువ మెట్ట, జరీబు భూములు ఇచ్చిన అర్హులైన రైతులకు కనీస వార్షిక కౌలు (యాన్యుటీ) చెల్లించేందుకు కూడా ఆమోదం లభించింది.
గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా సూపర్ బ్లాక్-ఇలో అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు గతంలో ఇచ్చిన రూ.798 కోట్ల పరిపాలనా అనుమతిని రద్దు చేశారు. కొత్తగా డిజైన్-బిల్డ్ ఐటమ్ రేట్ (లంప్సమ్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రూ.661 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరుకు, టెండర్లు పిలవడానికి ఏజీఐసీఎల్ ఎండీకి అధికారమిచ్చారు. అమరావతిలోని కృష్ణాయపాలెంలో నలంద అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు లీజు ప్రాతిపదికన 5 ఎకరాలు కేటాయించే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు 2024 జులై 1 నుంచి 2.73 శాతం, 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం చొప్పున రెండు డీఏ/డీఆర్‌లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ జీవోలకు ఆమోదం తెలిపారు.