Venkaiah Naidu: ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, సీఈసీ రాజీనామా డిమాండ్‌లపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శనివారం తీవ్రంగా స్పందించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడం దేశానికి, ప్రజాస్వామ్యానికి హానికరమని హెచ్చరించారు.

ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని పేర్కొన్న వెంకయ్య నాయుడు, ‘‘ఇవాళ ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి. రాజీనామా కోరడం తప్పు కాదు.. కానీ వ్యక్తిగత విమర్శలు సరికాదు’’ అని అన్నారు. సీఈసీ, ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్‌ సమంజసం కాదని స్పష్టం చేశారు.

ఓట్లను మూకుమ్మడిగా తొలగించారనే ఆరోపణలను ఖండిస్తూ, ‘‘ఇది కేవలం అపోహ మాత్రమే. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనడం అవాస్తవం’’ అని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనత అని చెప్పుకుని, ఓడిపోతే ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని నిందించడం హాస్యాస్పదమని విమర్శించారు.

రాజ్యాంగబద్ధ సంస్థను వీధుల్లోకి లాగడం తగదని నొక్కి చెప్పిన వెంకయ్య నాయుడు, ఎన్నికల సంఘం సభ్యులు తాము ఐక్యంగా ఉన్నామని చెబుతున్నారని గుర్తు చేశారు. ‘‘ప్రతిపక్షాలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలి. అంతిమంగా దేశప్రతిష్ఠ దెబ్బతినకుండా వ్యవహరించాలి. నిరసన తెలిపే హక్కు ఉంది.. కానీ హింసాయుతంగా చేయడం మంచిది కాదు’’ అని హితవు పలికారు.

ఎన్నికల సంఘం పనితీరుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపిన ఆయన, భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దదని, దాన్ని ప్రపంచం ప్రశంసిస్తుందని అన్నారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే రాజకీయ పార్టీలు, వారి కార్యకర్తలు తలుపు తలుపు తిరిగి సరిచూసుకోవాలని సూచించారు.

Tags: