Andhra Pradesh Cabinet: ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
క్యాబినెట్ కీలక నిర్ణయం
Andhra Pradesh Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు.
ముందుగా క్యాబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్లపై విస్తృత చర్చ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ తెరపైకి వచ్చిన మిశ్రా కమిషన్ నివేదికను మంత్రివర్గం ముందు ఉంచారు. కమిషన్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగ నిబంధనలను సమగ్రంగా పరిశీలించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో 50.42 శాతం బీసీ జనాభా ఉన్నట్లు మిశ్రా కమిషన్ నివేదిక వెల్లడించింది.
ఈ మేరకు క్యాబినెట్ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు వివరాలు వెల్లడించారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్‌పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్, మేయర్‌తో సహా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
పంచాయతీ వార్డు మెంబర్లలో బీసీలకు 26.73 శాతం, సర్పంచ్‌లలో 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీల్లో 24.60 శాతం, జడ్పీటీసీలకు 24.60 శాతం, జడ్పీ ఛైర్‌పర్సన్లకు 23.08 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అర్బన్ వార్డు మెంబర్లకు 32.78 శాతం, మున్సిపల్ ఛైర్‌పర్సన్లలో 32.03 శాతం, మేయర్లలో 35.02 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
ఈ నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.