Education Department Secretary Kona Sashidhar Clarifies: డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో నిర్వహించినట్లు తెలిపారు.

ఈ మేరకు అమరావతిలో మీడియాతో మాట్లాడిన కోన శశిధర్, డీఎస్సీ నియామకాలు మెరిట్ ఆధారంగానే జరిగాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఈ ప్రక్రియను 148 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. 154 టీసీఎస్ ఐఓఎన్ (TCS iON) కేంద్రాల్లో పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

ప్రశ్నాపత్రాల తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అత్యున్నత భద్రతా చర్యలు తీసుకున్నట్లు శశిధర్ వివరించారు. “ప్రశ్నాపత్రాన్ని ఎవరూ మానిప్యులేట్ చేయలేరు. కేవలం ఇద్దరు సీనియర్ అధికారులకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. పాస్‌వర్డ్‌లు ప్రతిరోజూ మారుతాయి. ప్రశ్నలు ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉంటాయి. పరీక్ష రోజు జంబుల్డ్ ప్రశ్నాపత్రమే అభ్యర్థులకు అందుతుంది” అని స్పష్టం చేశారు.

దేశంలోని అనేక ప్రతిష్టాత్మక పరీక్షలు కూడా ఇదే విధానంలో నిర్వహించబడుతున్నాయని, కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మాన్యువల్ జోక్యం చాలా తక్కువని ఆయన తెలిపారు. ఏపీ హైకోర్టు పరీక్షలు సహా ఇతర ముఖ్యమైన పరీక్షలు కూడా ఇదే విధానంలో జరుగుతాయన్నారు.

టీసీఎస్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేయబడ్డాయని, ఎక్కడా అక్రమాలకు అవకాశం లేదని శశిధర్ ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల ప్రకటనలో కూడా పూర్తి పారదర్శకత పాటించామని, డ్రాఫ్ట్ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ కీని విడుదల చేసినట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల స్కోర్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

కోన శశిధర్ వ్యాఖ్యలు:

“డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. అన్నీ మెరిట్ ఆధారంగానే జరిగాయి. ఆరోపణలు చేసేవారు నిరాధారమైన విషయాలను ప్రచారం చేస్తున్నారు.”

ఈ వివరణతో డీఎస్సీ నియామకాలపై వస్తున్న వివాదాలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.

Tags: