CM Chandrababu: కూటమి మిత్రధర్మంలో మినహాయింపులు లేవు.. స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా జెండా ఎగరాలి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య మిత్రధర్మం విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి చోటా కూటమి జెండా ఎగరాల్సిందేనని ఆయన తెలిపారు.
సోమవారం ఉదయం తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, స్థానిక ఎన్నికలు, కూటమి సమన్వయంపై సమగ్ర దిశానిర్దేశం చేశారు. గొడ్డలి పార్టీ అధినేత తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంతోపాటు కుటుంబ బంధాలనూ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు సాగుతున్నామని చెప్పిన చంద్రబాబు, ఆ ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ‘చెప్పాం-చేస్తున్నాం’ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.
2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చి అరాచకాలకు పాల్పడిన వైకాపాకు 2024లో ప్రజలు కేవలం 11 సీట్లే ఇచ్చి తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం చేశామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఈ విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి పార్టీల కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పొత్తులు, రిజర్వేషన్లు, సామాజిక సమీకరణాల కారణంగా పోటీ చేసే అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పదవుల ద్వారా గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఓటరూ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసేలా చూడాలని, 2024 ఎన్నికల కంటే ప్రతి బూత్లోనూ అధిక ఓట్లు సాధించాలని చంద్రబాబు నొక్కి చెప్పారు.