CM Chandrababu: అమరావతి అభివృద్ధి, హార్డ్‌వేర్ హబ్‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
కీలక ఆదేశాలు
CM Chandrababu: రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ 66వ అథారిటీ సమావేశం, 21వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశాల్లో ఆయన వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
ప్రజా రవాణాకు ప్రాధాన్యం.. అసెంబ్లీకి 250 మీటర్ల స్పైర్
రాజధాని పరిధిలో మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. విజయవాడ, గుంటూరు సహా సమీప ప్రాంతాలతో అమరావతిని అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. శాసనసభ భవనంపై లిఫ్ట్‌లతో సహా రూ.661 కోట్లతో 250 మీటర్ల ఎత్తైన స్పైర్ నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా స్పైర్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు, క్వాంటమ్ టవర్స్, బిట్స్ వంటి భవనాలు ప్రత్యేకమైన కట్టడాలుగా ఉండాలని స్పష్టం చేశారు. నగరంలో 50 శాతం సస్టెయినబుల్ గ్రీన్ కవర్‌తో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని, పుష్ప జాతుల మొక్కలు నాటి, కొండలు, నీటి వనరుల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
అమరావతి పేరు దేశవిదేశాల్లో మారుమోగేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. విద్యుత్ స్తంభాలు లేని, బ్లూ, గ్రీన్, డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ థీమ్‌గా నగరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి పౌరుడూ ‘ఇది నా నగరం’ అని భావించేలా చూడాలన్నారు. సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ఆదాయ నమూనాలపై కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
రూ.1,548 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు
పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించిన ముఖ్య నిర్ణయాలు:
రాజధానిలోని 29 గ్రామాలు, ప్రత్యేక లేఅవుట్‌లలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,548 కోట్లతో టెండర్లు.
సగటున ఒక్కొక్కరికి రోజుకు 135 లీటర్ల నీరు అందించేలా పైప్‌లైన్‌లు, వర్షపు నీరు, మురుగునీటి వ్యవస్థలను ప్రధాన పైప్‌లైన్‌లతో అనుసంధానం.
ఇంటర్నేషనల్ స్కూళ్లతో పాటు రాష్ట్రంలోని మంచి ప్రమాణాల విద్యా సంస్థలకు స్థలాలు కేటాయింపు (నలందా సంస్థకు కృష్ణాయపాలెంలో 5 ఎకరాలు).
హెచ్‌పీసీఎల్ కార్యాలయానికి నేలపాడులో స్థలం ఆమోదం.
రెండో విడత భూసమీకరణలో ఎకరం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు కూడా పూర్తి వార్షిక కౌలు చెల్లింపు. అక్టోబరు నెలాఖరుకు 80 శాతం పూర్తవుతుంది.
అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాల భూమి అవసరమని, దీనికోసం 20 వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంటుందని, తదుపరి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
హార్డ్‌వేర్ తయారీ హబ్‌గా ఏపీ.. రూ.22,154 కోట్ల పెట్టుబడులు
ఎస్‌ఐపీబీ సమావేశంలో రాష్ట్రాన్ని సెమీకండక్టర్లు, చిప్‌లు, రోబోటిక్స్ వంటి అధునిక సాంకేతిక రంగాల్లో హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి ఎలక్ట్రానిక్స్ హబ్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 28 ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో రూ.22,154.58 కోట్ల పెట్టుబడులు, 19,739 మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.
ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీతో పాటు పరిశోధన, డిజైన్, సోలార్ ప్యానళ్లు, క్వాంటమ్ టెక్నాలజీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌లో పూర్తి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలన్నారు. ఆమోదించిన ప్రాజెక్టులకు 6 నెలల్లో పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. తైవాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ వివరించారు.
పోర్టుల చుట్టూ లాజిస్టిక్స్, షిప్‌బిల్డింగ్, గోదాములు, తయారీ పరిశ్రమలు అభివృద్ధి చేయాలని, ఫిషింగ్ హార్బర్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పోర్టు, రైలు, రోడ్డు, ఎయిర్‌కార్గో, అంతర్గత జల రవాణాను అనుసంధానించి సమగ్ర లాజిస్టిక్ ఎకోసిస్టమ్ నిర్మించాలన్నారు. శ్రీసిటీలోని పరిశ్రమలతో తిరుపతి జిల్లా ఎగుమతుల్లో దేశంలో 10వ స్థానంలో, తూర్పుగోదావరి 12వ స్థానంలో ఉన్నాయని, మొదటి 5 స్థానాల్లోకి రావాలని లక్ష్యం పెట్టారు. 10వ తరగతి నుంచే యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, రేర్ ఎర్త్ మినరల్స్ హబ్, విద్యుత్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే 511 ఛార్జింగ్ స్టేషన్లకు అనుమతులు ఇచ్చారు. 21 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో 387 ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో రూ.14.05 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.79 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల లక్ష్యంలో 113.75 గిగావాట్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
సమావేశాల్లో మంత్రులు టీజీ భరత్, పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్‌రెడ్డి, సీఎస్ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.