Liquor Bribes: మద్యం లంచాలు జగన్ జేబులోకే.. యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు షరతులు
సీబీఐ కోర్టు షరతులు
Liquor Bribes: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి రెండు ముఖ్యమైన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు మద్యం కుంభకోణం కేసులో కీలక వాంగ్మూలం, మరోవైపు యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది.
వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు పిటిషన్ దాఖలు చేసుకున్న ఏపీఎస్‌బీసీఎల్ అప్పటి ప్రత్యేకాధికారి డి.సత్యప్రసాద్ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట వాంగ్మూలమిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన రూ.3,200 కోట్లకు పైగా లంచాల సొమ్మును రాజ్ కెసిరెడ్డి తొలుత వైఎస్ అనిల్‌రెడ్డి (జగన్ పెదనాన్న జార్జిరెడ్డి కుమారుడు), గోవిందప్ప బాలాజీ (భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి), కె.ధనుంజయరెడ్డి (నాటి సీఎంవో కార్యదర్శి), పి.కృష్ణమోహన్‌రెడ్డి (జగన్ ఓఎస్డీ), పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (వైకాపా ఎంపీ), వి.విజయసాయిరెడ్డి (అప్పటి వైకాపా ఎంపీ)లకు ఎప్పటికప్పుడు అందజేసేవారని చెప్పారు. వారంతా ఆ లంచాల సొమ్ములో కొంత తమ వాటాగా మినహాయించుకుని, సింహభాగం వివిధ మార్గాల్లో జగన్‌కే చేర్చేవారని వెల్లడించారు.
తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన సమావేశంలోనే మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి నెలకు రూ.50-60 కోట్లు లంచాలు వసూలు చేయొచ్చని లెక్కగట్టారని సత్యప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డికి, అమలు చేసే బాధ్యతలు తనకు, ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డికి అప్పగించారని వివరించారు. ఎక్సైజ్ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లాలనే ప్రయత్నాల్లో భాగంగా 2019లో వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఆయన బావమరిది మదన్‌మోహన్‌రెడ్డి ద్వారా కలిశానని, మద్యం విక్రయాలు, కమీషన్ల వ్యవహారాలు చూస్తే కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి లభించేలా చేస్తానని మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.
ఏయే బ్రాండ్లకు సరఫరా ఆర్డర్లు ఇవ్వాలనేది రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి నిర్ణయించేవారని, జారీ చేసిన మద్యం సరఫరా ఆర్డర్ల ఆధారంగా ఏయే డిస్టిలరీల నుంచి ఎంతెంత లంచాలు వసూలు చేయాలో సైఫ్ అహ్మద్, పొరుగు సేవల ఉద్యోగి అనూష డేటా తయారు చేసి రాజ్ కెసిరెడ్డికి పంపించేవారని వివరించారు. మద్యం కేసు మూల ధర (బేసిక్ ప్రైస్) ఆధారంగా ఒక్కో కేసుపై రూ.150 నుంచి రూ.600 వరకూ లంచాలు వసూలు చేసేవారని, లంచాలిచ్చిన సంస్థలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు జారీ చేసేవాళ్లని, లంచాలు ఇవ్వటానికి అంగీకరించని సంస్థలకు ససేమిరా అనేవారని చెప్పారు. లంచాల ఆధారాలు మాయం చేసేందుకు మద్యం సరఫరా ఆర్డర్ల జారీ నోట్‌ఫైళ్లను ధ్వంసం చేశారని, ఈ ప్రక్రియను మిథున్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాజ్ కెసిరెడ్డి పర్యవేక్షించారని తెలిపారు.
ఇదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ 15 రోజుల యూరప్ పర్యటనకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 30 మధ్య జగన్ యూరప్ వెళ్లేందుకు కోర్టు సమ్మతించింది. యూరప్ వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వాలని స్పష్టం చేసింది. పర్యటనలో ఉండే ఫోన్ నంబరు, ఇ-మెయిల్‌ను సీబీఐకు ఇవ్వాలని ఆదేశించింది.
మద్యం కుంభకోణం పూర్వాపరాలు అన్నింటినీ తేల్చేందుకు సత్యప్రసాద్ వాంగ్మూలం అత్యంత కీలకం కానుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.